వైసీపీ ఎమ్మెల్సీ, ప్రస్తుత మండపేట తోట త్రిమూర్తులుకు శిక్ష పడ్డ శిరోముండనం కేసు ఏపీలో సంచలనంగా మారింది. 28 సంవత్సరాల తర్వాత తీర్పు వెలువడగా… అసలు ఆరోజు ఏం జరిగింది? ఎందుకు ఇంత సంచలనంగా మారింది…?
1996, డిసెంబర్ 29న వెంకటాయపాలెంలో ఈ శిరోముండనం జరిగింది. ఆనాడు ఎన్నికల్లో తోట త్రిమూర్తులు వర్గం బూత్ లో రిగ్గింగ్ చేయాలని ప్రయత్నిస్తే, అడ్డుకున్నందుకు తమపై కోపం పెట్టుకొని తోట త్రిమూర్తులు, ఆయన కుటుంబ సభ్యులు ఐదుగురిని హింసించి, ఇద్దరికి గుండు కొట్టించి… కనుబొమ్మలు గీయించారని కేసు నమోదైంది.
1994లో జరిగిన ఎన్నికల్లో తోట త్రిమూర్తులు రామచంద్రాపురం ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో బీఎస్సీ తరఫున పోలింగ్ ఏజెంట్లుగా ఉన్న ఇద్దరితో తోట త్రిమూర్తులు కుటుంబ సభ్యులకు వాగ్వాదం జరిగింది. బూత్ లోకి చొరబడి రిగ్గింగ్ చేయాలని భావిస్తే, తాము అడ్డుకున్నామని ఆ బాధితులు పేర్కొన్నారు. ఆ కక్షతోనే తమపై అక్రమ కేసులు బనాయించారని, 1996 డిసెంబర్ లో శిరోముండనం చేశారని బాధితులు ఆరోపణ.
నిజానికి ఈ కేసులో 2015లోనే తీర్పు రావాల్సి ఉన్నప్పటికీ, తాము అసలు దళితులమే కాదని… మతం మార్చుకున్నామని కొత్త వాదనను తోట త్రిమూర్తులు తెచ్చారని, ఆలస్యం అయినా తమకు న్యాయం జరిగిందని బాధితులు మీడియాకు వివరించారు.
అయితే, ఇది రెండు సంవత్సరాల కన్నా తక్కువ జైలు శిక్ష పడ్డ కేసు కావటంతో తోట త్రిమూర్తులు ఎన్నికల్లో పోటీ చేసుకునే అవకాశం ఉంది. దీనిపై అప్పీల్ కు వెళ్లి, శిక్షపై స్టే తెచ్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.