సమ్మర్ సీజన్‌పై ఇండస్ట్రీకి ఎంతో కొంత నమ్మకం వుంది. అందుకే వరుసగా పరాజయాలు ఎదురవుతున్నా, కొత్త సినిమాలు సిద్ధం చేస్తున్నారు. ఈ వేసవిలో గుర్తుండిపోయే విజయం చిత్రసీమకు దక్కలేదు. ఇది వాస్తవం. సినిమాలకు వచ్చే మూడ్ జనాల్లో కనిపించడం లేదు. ఐపీఎల్ ఎఫెక్ట్ ఇండస్ట్రీపై దారుణంగా వుంది. అయినా సరే, మంచి సినిమా వస్తే… ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడతారన్న ఓ నమ్మకంతోనే సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. గత వారం రెండు సినిమాలు వచ్చాయి. కానీ వాటికి వసూళ్ల హడావుడి కనిపించడం లేదు. ఈ వారం ‘సారంగపాణి జాతకం’ మినహా.. పెద్దగా హడావుడి లేదు. మే 1న ‘హిట్ 3’ వస్తోంది. సినిమాలపై ఐపీఎల్ హడావుడి ఎంత అన్నది ఈ సినిమాతో అర్థమైపోతుంది.
ఎందుకంటే ‘హిట్’ విజయవంతమైన ఫ్రాంచైజీ. హిట్ 1, హిట్ 2 మంచి ఆదరణ సాధించాయి. ఇక హిట్ 3పై విపరీతమైన హైప్ వుంది. కారణం.. ఇందులో హీరో నాని. తనలోని మెంటల్ మాస్ ఈ సినిమాతో బయటకు వచ్చాడన్న విషయం టీజర్, ట్రైలర్లతో అర్థం అవుతోంది. నాని క్రౌడ్ పుల్లర్ హీరో. తన సినిమా అంటే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ రెడీగా ఉంటారు. హిట్ లాంటి ఫ్రాంచైజీలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ వుంది. పైగా నాని ప్రమోషన్ స్పెషలిస్ట్. తన సినిమాల్ని జనంలోకి బాగా తీసుకెళ్లగలడు. 15 రోజుల ముందు నుంచీ హిట్ 3 ప్రమోషన్లు మొదలెట్టేశాడు. ఇప్పుడు అదే పనిలో ముంబై వెళ్లాడు. నార్త్ లో 10 రోజుల పాటు ఉంటాడు. ప్రమోషన్లు, ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు అంటూ హడావుడి కొనసాగుతుంది. హిట్ 3 కూడా ఓపెనింగ్స్ రాకపోతే, హిట్ టాక్ వచ్చినా కలక్షన్లు అంతంత మాత్రంగా ఉంటే అప్పుడు ఐపీఎల్ ఎఫెక్ట్ ఉందా, లేదా? అనేది నిర్దారించుకోవొచ్చు. ఓరకంగా హిట్ 3 అనేది నానికి కాదు.. చిత్రసీమకే ఓ పెద్ద పరీక్ష. అసలైన వేసవి సీజన్ హిట్ 3తో మొదలైందనుకోవొచ్చు. ఎందుకంటే హరిహర వీరమల్లు, కింగ్డమ్ లాంటి చిత్రాలు క్యూలో ఉన్నాయి. హిట్ 3 రిజల్ట్ ని బట్టి నిర్మాతల మైండ్ సెట్ మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.