బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు హిట్ అండ్ రన్ కేసులో తవ్వినకొద్దీ నిజాలు బయటకొస్తూనే ఉన్నాయి. ఓ కేసులో తీగలాగితే గతంలో జరిగిన కేసుల్లో తను తప్పించుకున్న తీరు బయటకు రావటంతో పాత కేసులను కూడా పోలీసులు రీఓపెన్ చేస్తున్నారు.
మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు మద్యం మత్తులో ప్రజా భవన్ ముందు బారీకేడ్లను ఢీకొట్టి వెళ్లిపోయాడు. పోలీసులు అరెస్ట్ చేశాక, షకీల్ కొడుకు రాహెల్ ప్లేసులో మరొకరిని సరెండర్ చేసి వెళ్లారు. ఇదంతా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సీసీ కెమెరాలతో పాటు దాడి జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. దీంతో హైదరాబాద్ సీపీ సీరియస్ అయి, పంజాగుట్ట స్టేషన్ సిబ్బందిని మొత్తం మార్చేశారు. ఆఫీసర్లను అరెస్ట్ కూడా చేశారు.
అయితే, దుబాయ్ పారిపోయిన రాహెల్ ఇటీవలే హైదరాబాద్ వస్తూ పోలీసులకు చిక్కాడు. దీంతో కేసు దర్యాప్తు సమయంలో పోలీసులకు గతంలో జూబ్లీహిల్స్ లో జరిగిన హిట్ అండ్ రన్ కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి.
రెండేళ్ల క్రితం జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 లో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. బెలూన్లు అమ్ముతూ రోడ్డు దాటుతున్న కాజోల్ చౌహాన్ అనే మహిళను ఓ కారు ఢీకొట్టింది. దీంతో కాజోల్ చేతిలో ఉన్న రెండు నెలల శిశువు కింద పడిపోయి, అక్కడికక్కడే మృతిచెందాడు. కాజోల్ కూడా తీవ్రంగా గాయపడింది. ప్రమాదం జరగ్గానే ముగ్గురు వ్యక్తులు అక్కడి నుండి పరారయ్యారు. అయితే, ఆ వాహనంపై ఎమ్మెల్యే షకీల్ స్టిక్కర్ ఉండటంతో పోలీసులు విచారణ చేయగా, కొడుకు రాహెల్ అందులో లేడని అబద్దం చెప్పించి మరో వ్యక్తి లొంగిపోయారు. పోలీసులు కూడా ఆ కేసును అక్కడితో అప్పట్లో ముగించారు. కానీ ఇప్పుడు ఆ కేసును బయటకు తీసి విచారిస్తున్నారు.