హిట్‌తో తొలి అడుగులోనే ఆకట్టుకొన్నాడు శైలేష్ కొలను. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ తయారైంది. హిట్ లో విశ్వక్ పోలీస్ ఆఫీసర్ అయితే… హిట్ 2లో ఆ అవకాశం అడవి శేష్‌కి దక్కింది. ఈ సినిమాకీ నానినే నిర్మాత. డిసెంబరు 2న వస్తోంది. ఇప్పుడు టీజర్ విడుదల చేశారు.
హిట్ లో.. విశ్వక్ పాత్రకీ పార్ట్ 2లో కొంత వ్యత్యాసం ఉంది. విశ్వక్ ఎప్పుడూ సీరియస్‌గా ఉండే పోలీస్. అయితే.. అడవిశేష్ అలా కాదు. జోవియల్‌గా, ఎలాంటి విషయాన్నయినా సరదాగా తీసుకొనే పోలీస్. రావు రమేష్ మాటల్లో చెప్పాలంటే.. కొంత నోటి దురుసు కూడా ఎక్కువే. ”అవతలి టీమ్ వీక్ అని మన గోల్ కీపర్‌కి రెస్ట్ ఇవ్వలేం కద సార్” అనే డైలాగ్ తో…. హీరో క్యారెక్టరైజేషన్ మొత్తం చెప్పేశారు. విశాఖలో, అసలు క్రైమ్ రేటే లేని చోట… హీరోకి పోస్టింగ్ వస్తుంది. అంతా సవ్యంగానే ఉందనుకొన్నప్పుడు ఓ ఛాలెంజ్ ఎదురవుతుంది. ఓ సైకో కిల్లర్… వరుసగా హత్యలు చేస్తుంటాడు. తను ఎవరు? ఈ కేస్‌ని ఎలా ఛేధించారు అనేది కథాంశం. దాదాపుగా అన్ని మర్డర్ మిస్టరీల్లోనూ ఇలాంటి కథే ఉంటుంది. హిట్ లోనూ అంతే. కానీ ట్రిట్ మెంట్ వేరుగా ఉంది. `హిట్ 2`లోనూ… అది కనిపిస్తే… బొమ్మ హిట్టే. పైగా అడవిశేష్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. మర్డర్ మిస్టరీలకు తెలుగు నాట మంచి గిరాకీ ఉంది. ఎలా చూసినా.. హిట్ 2పై కొన్ని హోప్స్ పెట్టుకోవొచ్చు.