ప్రభుత్వం వేలం వేసే భూములు చిక్కులు లేకుండా క్లియర్ టైటిల్ తో ఉంటాయి ఓ రూపాయి ఎక్కువ పెట్టి అయినా కొనుగోలు చేస్తే తప్పేం లేదని ఎక్కువ మంది అనుకుంటారు. అయితే ప్రభుత్వాలు వేలం వేసే భూములు పరిమితంగా ఉంటాయి. ఒక్కో సారి వేలం వేసినా సామాన్యులకు అందుబాటులో లేకుండా..బడా బడా నిర్మాణ సంస్థలే పాల్గొనేలా పెద్ద పెద్ద ప్లాట్లు అమ్ముతున్నారు. అయితే ఈ సారి సామాన్యులకూ అందుబాటులో ఉండేలా హెచ్ఎండీఏ కొన్ని ప్లాట్లను వేలం వేసేందుకు సిద్దమయింది. మార్చి ఒకటో తేదీన ఈ వేలం జరగనుంది.
హైదరాబాద్ చుట్టుపక్కల గల రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలో ఉన్న 38 ప్లాట్లను మార్చి ఒకటిన వేలం వేయడానికి హెచ్ఎండీఏ ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఎం.ఎస్.టి.సి ఆధ్వర్యంలో ఆన్ లైన్ వేలం ద్వారా వీటిని అమ్మకానికిపెట్టింది. వంద శాతం చిక్కులు లేని, క్లియర్ టైటిల్ ఉన్న ఈ ప్లాట్లను కొన్నవారు.. సత్వరమే భవన నిర్మాణ అనుమతులు పొందడానికి అవకాశం ఉంటుంది.
రంగారెడ్ది జిల్లాలోని గండిపేట మండలంలో మూడు ప్లాట్లు హెచ్ఎండీఏ వేలం లిస్టులో ఉన్నాయి. అలాగే శేరిలింగంపల్లి మండలంలో ఐదు, ఇబ్రాహీంపట్నం మండలంలో రెండు చోట్ల ప్లాట్లు వేలం వేస్తున్నారు. మల్కాజిగిరి జిల్లాలోని మేడిపల్లి మండలంలో నాలుగు, ఘట్ కేసర్ మండలంలో ఒకటి చొప్పున ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలోని అమీన్ పూర్ మండలం పరిధిలో పదహారు, ఆర్.సి పురం మండలంలో ఆరు, జిన్నారం మండలంలో ఒకటి చొప్పున ప్లాట్లు ఉన్నాయి. వెలిమల గ్రామంలోనే అందుబాటులో 121 గజాల నుంచి 3,630 గజాల ప్లాట్లు ఉన్నాయి.
సామాన్యులు కూడా ఈ వేలంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. అమీన్ పూర్, ఆర్సీపురం, జిన్నారం ప్రాంతాల్లో స్థలాలకు ఇటీవల డిమాండ్ పెరుగుతోంది. అక్కడ మంచి రేటు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.