హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ వేసే లే ఔట్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఉప్పల్ భగాయత్ కు ప్రజల నుంచి మంచి ఆదరణ వచ్చింది. తాజాగా పెద్ద అంబర్పేట్, ఘట్కేసర్, బాలాపూర్ మండలాల పరిధిలో 515 ఎకరాల్లో భారీ లేఅవుట్లను డెవలప్ చేసేందుకు తాజాగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. కొర్రెముల, తిమ్మాయిగూడ, కుత్బుల్లాపూర్, కుర్మల్ గూడ, నాదర్గుల్ ప్రాంతాల్లో స్థలాలను పూలింగ్ చేయబోతోంది.
హెచ్ఎండీఏ స్వయంగా విక్రయించే భూములు, స్థలాలకు మంచి డిమాండ్ ఉంటుంది. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తిమ్మాయిగూడలో 156 ఎకరాలు, అదే మండలంలోని కుత్బుల్లాపూర్‌లో 130 ఎకరాలు, బాలాపూర్ మండలం కుర్మల్‌గూడ, నాదర్గుల్ గ్రామాల పరిధిలో 115 ఎకరాలు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ కొర్రెములలో 114 ఎకరాలను అభివృద్ధి చేయాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. మొత్తం 515 ఎకరాల భూములిచ్చేందుకు రైతులు అంగీకరించడంతో ఆయా సర్వే నెంబర్ల ఆధారంగా అధికారులు నోటిఫికేషన్లు జారీ చేశారు.
భూములను అభివృద్ధి చేసిన తర్వాత లేఅవుట్లలో రైతులకు 60 శాతం వాటా ఇస్తారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో లేఅవుట్లను 30 అడుగులు, 40 అడుగులు, 60 అడుగుల రోడ్లు, అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ, నీటి సరఫరా వ్యవస్థ, పార్కులను హెచ్ఎండీఏ అభివృద్ధి చేస్తుంది. అన్ని పూర్తి చేసి మరో ఏడాదిలో వేలానికి వచ్చే అవకాశాలు ఉంటాయని అనుకోవచ్చు.