మెడికల్ మాఫియా మరోసారి ప్రజల్ని దోచుకునేందుకు అతి పెద్ద స్కెచ్ వేసింది. చైనాలో ఉందో లేదో తెలియని వైరస్ పై తప్పుడు వీడియోలను సోషల్ మీడియాలో హైలెట్ చేసి మన దేశంలో ఏదో జరిగిపోతోందన్న భావన కల్పించింది. వెంటనే హెచ్ఎంపీవీ వైరస్ టెస్టులు, చికిత్స అంటూ హడావుడి ప్రారంభించారు. ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి.. భయపెట్టి లక్షలు గుంజడానికి రెడీ అయ్యారు. ఇక్కడ కూడా వారి టార్గెట్.. రోగనిరోధక శక్తి తక్కువగా అన్నవాళ్లే. ఈ పేరు చెప్పి వాళ్లని పీల్చి పిప్పి చేయడమే.
హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏమిటి అంటే జలుబు, దగ్గు, ఎలా తగ్గుతుందంటే.. దానికి ప్రత్యేకమైన మందేమీ లేదు. అదే తగ్గిపోతుంది. అంటే మనం జలుబు అని చెప్పుకుంటాం.. వైద్యులు హెచ్ఎంపీవీ అంటారు. ఆ పేరు చెప్పి భయపెట్టి మనల్ని ఆర్థికంగా నాకేస్తారన్నమాట. ఇప్పటికే హెచ్ఎంపీవీ టెస్టులకు రూ. ఇరవై వేలు ఖర్చు అవుతుదంని ప్రచారం చేస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్న వారికి ఏమీ కాదని.. చిన్న పిల్లలు,అనారోగ్యంగా ఉన్నవారికి పెను ప్రమాదమని.. కరోనా తరహాలో ప్రచారంచేస్తున్నారు.
కరోనా సమయంలో మెడికల్ మాఫియా ప్రజల నుంచి లక్షల కోట్లు కొల్లగొట్టింది. ఎంతగా అంటే ఏ ఆస్పత్రి ఖాళీ లేదు. ప్రత్యేకంగా హోటల్స్ అద్దెకు తీసుకుని వాటిని ఆస్పత్రులుగా మార్చారు. ఒక్కో కుటుంబం నుంచి లక్షలు దండుకున్నారు. ఫార్మా కంపెనీలేం చిన్న చిన్న దోపిడీలు చేయలేదు. యాంటీ వైరల్ డ్రగ్స్ పేరుతో లక్షలకు లక్షలకు బ్లాకుల్లో అమ్మారు. ఇప్పుడు మరోసారి అదే పరిస్థితి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజలకు హెచ్ఎంపీవీ వైరస్ ప్రమాదకరం కాదు. కానీ ఈ మెడికల్ మాఫియా ఉచ్చులో చిక్కుకుంటే మాత్రం దివాలా తీయాల్సిందే.