ఆ మధ్య శంకర్ చాలా హడావుడే చేయించాడు. విఖ్యాత హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ను రజనీకాంత్ ‘రోబో-2’ లో విలన్ గా నటింపజేయిస్తున్నాం.. అని గట్టిగా ప్రచారం చేశారు. అంతా అయిపోయిందని.. వంద రోజుల డేట్స్ ను కూడా సంపాదించామని.. రజనీతో నటించడానికి ఆర్నాల్డ్ ఓకే చెప్పాడని కూడా అన్నారు. ఏకంగా హాలీవుడ్ నటుడిని విలన్ గా నటింపజేసేస్తున్నాం.. అంటూ ‘రోబో-2’ విషయంలో అలాంటి ప్రచారం గట్టిగా చేశారు. ఆ తర్వాత ఆ ఊసే లేకుండా పోయింది.
అర్నాల్డ్ ప్లేస్ లోకి అక్షయ్ కుమార్ వచ్చాడు. రజనీకి హాలీవుడ్ విలన్ అని జరిగిన ప్రచారం గాలికిపోయి.. బాలీవుడ్ విలన్ వచ్చాడు. అయితే ఆర్నాల్డ్ పేరుతో దండిగా ప్రచారం లభించింది. ఆ తర్వాత ఈ మధ్యనే జాకీచాన్ ఒక తమిళ సినిమాలో నటించనున్నాడని ప్రచారం మొదలుపెట్టారు. ఈ సారి రజనీ- జాకీ ఛాన్ కాంబోలో సినిమా అంటున్నారు. మరి అదంత సులభమైన వ్యవహారం కాదు.
ఇక తమిళుల సంగతలా ఉంటే.. ఇప్పుడు ఒక తెలుగు సినిమా విషయంలో కూడా హాలీవుడ్ నటుడి పేరువినిపిస్తోంది. బాలకృష్ణ వందో సినిమా ‘శాతకర్ణి’ లో హాలీవుడ్ నటులు నాథన్ జోన్స్ ను నటింపజేయనున్నారని అంటున్నారు. ‘ట్రాయ్’ సినిమాలో బ్రాడ్ ఫిట్ చేతిలో చచ్చిపోయే పాత్రతో నాథన్ జోన్స్ ఇండియాకు పరిచయస్తున్నాడు. అయితే ఇప్పటి వరకూ ఆ నటుడితో సంప్రదింపులు ఏమీ జరగలేదు కానీ.. జస్ట్ ఆలోచనను బయటకు వదిలారు ఈ సినిమా వాళ్లు. దీంతో ఇప్పుడు ‘శాతకర్ణి’ సినిమా పై అంతటా చర్చ జరుగుతోంది. మరి నాథన్ జోన్స్ ఒక రీజనల్ సినిమాలో నటిస్తాడా? అతడి పారితోషకాన్ని మనోళ్లు భరించగలరా? అనేవి స్పష్టత లేని అంశాలు. మొత్తానికి సౌతిండియన్ ఫిల్మ్ మేకర్లు తెలివి మీరిపోయారు. హాలీవుడ్ నటుల పేర్లను ప్రచారానికి వాడేసుకునే తెలివితేటలను కనబరిచేస్తున్నారు!