యథారాజా తథా ప్రజ అంటారు. ఆ సూత్ర ప్రకారమే ముఖ్యమంత్రికి ఉన్న సెంటిమెంట్లు జనాలకు కూడా అంటించేశారు! చంద్రబాబు నాయుడికి సెంటిమెంట్లు కాస్త ఎక్కువ అని కొంతమంది విమర్శిస్తూ ఉంటారు. దానికి అనుగుణంగానే గత ఏడాది జరిగిన రాజధాని శంకుస్థాపనకు రకరకాల పూజలూ పునస్కారాలూ చేశారు. రాజధాని కోసం అట్టహాసంగా రాష్ట్రంలోని అన్ని గ్రామాల నుంచీ మట్టి తెప్పించారు. రాజధానిలో ప్రజలందరి భాగస్వామ్యం ఉండాలన్నారు. 13 వేల గ్రామాల నుంచి మట్టి తెప్పించారు. దాంతోపాటు అఖండ జ్యోతులను కూడా వెలిగించి రాజధానికి తెమ్మన్నారు. అన్ని పుణ్య క్షేత్రాల నుంచీ మట్టినీ, పుణ్య నదుల నుంచీ పవిత్ర జలాలను కూడా శంకుస్థాపన ప్రాంగణానికి రప్పించారు. నాడు శంకుస్థాపనకు ముఖ్య అతిథిగా వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా పార్లమెంటు ప్రాంగణం నుంచి మట్టినీ, యమునా నది నుంచి జలాలను తీసుకొచ్చారు.
శంకుస్థాపన కార్యక్రమం జరిగి ఏడాది దాటేసింది! ప్రస్తుతం ఉద్దండరాయుని పాలెంలో కేవలం శిలాఫలకాలు తప్ప ఇంకేమీ లేదు! సరే, రాజధాని ఎప్పుడు నిర్మించినా ఆ పవిత్ర మట్టిని వాడాలి కదా. అయితే, రాష్ట్రంలోని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తీసుకొచ్చిన మట్టిని భద్రంగా దాచారా అంటే లేదనే తెలుస్తోంది! అఖండ జ్యోతిని అమరేశ్వరాలయంలో పెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెచ్చిన పవిత్ర జలాలు, మట్టి ప్రస్తుతం తుళ్లూరు తాసిల్దార్ కార్యాలయంలో ఉన్నాయట. కానీ, గ్రామాల నుంచి ప్రజలు పంపిన మట్టి మాత్రం… మట్టికొట్టుకుపోయిందట!
ఆ మధ్య రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు సేకరించిన మట్టంతా కొట్టుకుపోయిందని తెలుస్తోంది. అంతేకాదు, అన్ని ప్రాంతాల నుంచి తెప్పించిన పవిత్ర జలాలు కూడా ఏమయ్యాయో తెలీదు! ప్రధాని తీసుకొచ్చిన మట్టిని భద్రంగా దాచి, ప్రజలు తెచ్చిన దాన్ని ఇలా నీటికి వదిలేయడం ఎంతవరకూ కరెక్ట్..? అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఒక ఎమోషనల్ ఈవెంట్‌గా ప్రజలందరికీ కనెక్ట్ చేశారు. సీఎంకు ఉన్న సెంటిమెంట్లను రాష్ట్ర ప్రజలపై కూడా రుద్దేసి మరీ మట్టీ, నీళ్లూ తెప్పించారు. అలా రుద్దినప్పుడు వాటిని కాపాడుకోవాలి కదా! పోనీ, వర్షాల్లో అన్నీ కొట్టుకుపోయాయంటే ఓ అర్థం ఉంది. ప్రధానమంత్రి తెచ్చిన మట్టికి జాగ్రత్తపరచి… ప్రజలు ఇచ్చిన మట్టిని పట్టించుకోకపోతే… ఎలాంటి సంకేతాలు ఇచ్చినట్టు..?