దేశాన్ని జాగీరుగా దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బిక్కుబిక్కుమంటోంది. అక్టోబర్ 31 నాడు రెండు కీలక సందర్భాలు. ఒకటి, ఇందిరా గాంధీ వర్ధంతి. రెండు, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇందిర వర్ధంతిని స్వాతంత్ర్య దినోత్సవం కంటే అది పెద్ద సందర్భంగా అనే స్థాయిలో హడావుడి జరిగేది. దూరదర్శన్ లో అది తప్ప మరేమీ కనిపించని స్థాయిలో కవరేజీ ఉండేది. సర్దార్ పటేల్ ఊసే వినిపించేది కాదు.
ఇప్పుడు సీన్ మారింది. బీజేపీ అధికారంలోకి వచ్చింది. అందులోనూ మోడీ అనే మొండి ఘటం ప్రధాన మంత్రి అయ్యారు. అంతే. నీవు నేర్పిన విద్యయే… అన్నట్టు శనివారం నాడు పటేల్ జయంతి, రన్ ఫర్ యూనిటీ తదితర కార్యక్రమాలను దూరదర్శన్ సవివంగా కవర్ చేసింది. ఈ సందట్లో ఇందిర వర్ధంతి కవరేజీ గల్లంతైంది. దీంతో కాంగ్రెస్ వారికి కడుపు మండింది. ఢిల్లీలోని దూరదర్శన్ భవనం మండీ హౌస్ ముందు మండిపడుతూ నినాదాలు చేశారు. అయితే మాత్రం, కవరేజీ వచ్చే చాన్సే లేదు.
ఈ దేశంలో కాంగ్రెస్ చేసిన విన్యాసాలు, చరిత్రకు చేసిన అన్యాయాలు అన్నీ ఇన్నీ కావు. పాఠ్య పుస్తకాలు మొదలు మీడియా కవరేజీతో సహా సమస్తం ఒక్క కుటుంబం మీదే ఫోకస్ చేశాయి. భారత దేశం అంటే, ఇక్కడ గొప్ప వాళ్లు అంటే నెహ్రూ, ఇందిరా గాంధీ, అమె వారసులే అనిపిస్తుంది, కాంగ్రెస్ స్పాన్సర్ చేసిన చరిత్రను చదివితే. పాఠ్య పుస్తకాల నిండా పక్షపాతపు చరిత్రే. గాంధీజీతో సమానంగా కోట్లాది మంది దృష్టిలో హీరో అయిన స్వాతంత్ర్య సమర సేనాని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ను కూడా ఓ గల్లీ స్థాయి లీడర్ లా స్థాయి తగ్గించి చరిత్రను వక్రీకరించారు.
అక్టోబర్ 2నాడు గాంధీ జయంతి. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి. కానీ కాంగ్రెస్ జమానాలో శాస్త్రి జయంతి అనేది మాయమవుతుంది. కేవలం గాంధీ జయంతి సందడి మాత్రమే కనిపిస్తుంది. జై జవాన్ జై కిసాన్ నినాదాన్నిచ్చి, పాక్ తో రెండో యుద్ధంలో సంచలన విజయాలు సాధించేలా సైన్యానికి స్ఫూర్తినిచ్చిన శాస్త్రి గురించి మనకు తెలిసింది గోరంతే. ఈ పాపం కూడా కాంగ్రెస్ దే.
మోడీ ప్రధాని అయిన తర్వాత సీన్ మారిపోయింది. ఒక కుటుంబంపై ఫోకస్ చేసే దుష్ట సంప్రదాయం బంద్ అయింది. దీంతో కాంగ్రెస్ కడుపు రగిలిపోతోంది. ప్రజలు నాలుగు పదుల సీట్లు ఇచ్చి ఆ పార్టీ మీద తమకున్న అభిప్రాయం ఏమిటో సూటిగా చెప్పినా ఆ పార్టీ వారికి మాత్రం తత్వం బోధపడటం లేదు. ఆ కుటుంబంలో పుట్టినందుకు దేశానికి రారాజులం అనే విర్రవీగుడు తనం పోవడం లేదు. దేశాన్ని ఏలేది మేమే అనే ధోరణి వల్ల ఒరిగేది ఏమీలేదు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒకప్పుడు వాజ్ పేయి జమానాలో కాంగ్రెస్ మరీ ఇంతలా గిలగిల్లాడిపోయే పరిస్థితి లేదు. వాజ్ పేయి శైలి వేరు. ఇప్పుడు మోడీ అలా కాదు. టిట్ ఫర్ టాట్ తరహాలో కాంగ్రెస్ ను ఓ ఆట ఆడుకుంటున్నారు. ఇలాంటి సమయంలో అయినా కాంగ్రెస్ వారు, ఆ ఒక్క కుటుంబం వారు వాస్తవాన్ని గ్రహించాలి. భవిష్యత్తులో విర్రవీగుడు లక్షణం లేకుండా తమ లోంచి ఆ ఆదిపత్య భావనను తొలగించుకునేందుకు ప్రయత్నించాలి. కానీ అలా జరుగుతుందా? ఏమో.