హోమ్ లోన్ వడ్డీ రేట్లు మరోసారి తగ్గడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఓ సారి రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన ఆర్బీఐ.. మరోసారి ఇలాంటి తగ్గింపును ప్రకటించనుంది. తొమ్మిదో తేదీన ఆర్బీఐ పరపతి విధాన ప్రకటనలో భాగంగా వడ్డీ రేట్లను మరింతగా తగ్గించే అవకాశాలు ఉన్నాయని మార్గెట్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
కరోనా కాలంలో వడ్డీ రేట్లు బాగా తక్కువగా ఉండేవి. తర్వాత ద్రవ్యోల్బణం పెరిగిపోయిందని చెప్పి వరుసగా వడ్డీ రేట్లు పెంచుకుంటూ పోయారు. చివరికి 6.50 శాతం దగ్గర నిలకడగా ఉంచారు. అయితే అప్పటికే వడ్డీ రేట్లు పది శాతం వరకూ వెళ్లాయి. ఇటీవల 25 బేసిస్ పాయింట్లు మొదటి సారి తగ్గించడంతో 6.25 శాతానికి తగ్గింది. ఇప్పుడు కూడా ఆర్బీఐ 0.25 శాతం కోత విధిస్తుందని మార్కెట్ భావిస్తోంది.
రెపో రేటును తగ్గిస్తే తీసుకున్న లేదా కొత్తగా తీసుకోబోయే రుణాలు చవకగాల మారతాయి. EMI భారం నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. మొత్తం సంవత్సరంలో 0.75 శాతం తగ్గింపును చూడవచ్చని బ్యాంకులు భావిస్తున్నాయి. అంటే తక్కువ వడ్డీకి పెద్ద ఎత్తున రుణాలు లభిస్తాయి. ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉండటంతో ఆర్బీఐ దృష్టి ఆర్థిక వృద్ధిని పెంచడంపై దృష్టి పెట్టింది.
దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ డల్ గా ఉంది. మార్కెట్ కు బూస్టు ఇవ్వడానికైనా రెపోరేట్ ను తగ్గించడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే ఇళ్ల కొనుగోలుదారులు కాస్త ఎదురుచూడటం మంచిదన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.