ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీలో ప్రజలను ఇళ్ల రుణాల నుంచి విముక్తుల్ని చేయాలని నిర్ణయించారు. హౌసింగ్ లోన్ల భారంతో కట్టలేకపోయిన 46 లక్షల మందిని గుర్తించారు. వారందరికీ వన్ టైం సెటిల్మెంట్ పథకం అమలు చేయాలని కేబినెట్లో నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.20 వేలు మున్సిపాలిటీల్లో రూ.30 వేల వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద చెల్లించి పేదలు ఇళ్ల రుణాల నుంచి విముక్తి కావొచ్చు.
1983 నుంచి ఏపీలో హౌసింగ్ కార్పొరేషన్ పేరు మీద ఇళ్లు ఇస్తున్నారు. సగం సొమ్ము సబ్సిడీగా మిగతా సగం సొమ్ము లబ్దిదారులు రుణంగా ఇళ్లు ఇస్తారు. ఆ సగం సొమ్మును లబ్దిదారులు పది లేదా ఇరవై ఏళ్ల వాయిదాల్లో చెల్లించాలి. అయితే ఇళ్లను తీసుకుంటున్న లబ్దిదారులు ప్రభుత్వమే కదా అని చెల్లించడం లేదు. ప్రభుత్వాలు కూడా లైట్ తీసుకున్నాయి. అడగడం మానేశాయి. దాంతో ఆ లోన్లు అలాగే ఉండిపోయాయి. ఆ ఆస్తులపై యాజమాన్య హక్కులు లోన్ పూర్తి కాకపోవడం వల్ల వారిపైకి మారలేదు.
అందుకే సీఎం జగన్ వారికి వన్ టైం సెటిల్మెంట్ ప్రకటించి రుణవిముక్తుల్ని చేసి వారి ఆస్తులకు వారినే యజమానులను చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయం వల్ల 46,61,737 మంది లబ్ధి పొందుతారని మంత్రి పేర్ని నాని ప్రకటించారు. అయితే అసలు పేదలు కిస్తీలు కట్టడం మానేసిన ఏళ్ల తర్వాత వాటిని మాఫీ చేయాల్సింది పోయి వన్ టైం సెటిల్మెంట్ పేరుతో ఎప్పుడో తీసుకున్న రుణాలను ఈ ప్రభుత్వం వసూలు చేయడం ఏమిటని విపక్షాలు… పేదలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం కనిపిస్తోంది.