రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్పకు కోపం వచ్చింది. సామర్లకోట ప్రభుత్వాసుపత్రి ప్రహారీ గోడ శంకుస్థాపన కార్యక్రమానికి రాజప్ప వచ్చారు. ఈ సందర్భంగా ఆసుపత్రి పరిస్థితిపై డీఎంహెచ్వో మీద ఫైర్ అయ్యారు. పనితీరుపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయనీ, మరోసారి ఇలాంటివి తన ద్రుష్టికి వస్తే విధుల నుంచి బహిష్కరిస్తానంటూ హెచ్చరించడం విశేషం. దీంతో అక్కడున్నవారంతా షాక్ అయ్యారు. మంత్రిగారికి ఇంత ఆగ్రహం ఎందుకొచ్చిందా అని చర్చించుకున్నారు. అయితే, అక్కడితో ఆగని చినరాజప్ప.. వెంటనే ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కి ఫోన్ చేశారు. అంతేకాదు… కామినేని ఫోన్ ఆన్సర్ చేయగానే చినరాజప్ప స్పీకర్ ఆన్ చేసి, ఆరోగ్య శాఖ పనితీరుపై బహిరంగంగా తీవ్ర అసంత్రుప్తి వ్యక్తం చేయడం చర్చనీయం అవుతోంది.
‘పాజిటివ్ గా మాట్లాడాలంటే ఎలా..? మహా అయితే మరో రెండుమూడు నెలలు చూస్తాను, ఆ తరువాత వీళ్లని తీసేస్తాను’ అంటూ కామినేనితో మాట్లాడారు. ఇక్కడ ఆసుపత్రుల్లో సౌకర్యాలు సరిగా ఉండటం లేదనీ, సరైన సిబ్బంది ఇవ్వడం లేదనీ, సూపరెంటెండెంట్ సరిగా ఉండరంటూ కామినేనిపై చిందులేశారు. ఇక్కడున్న సిబ్బంది బాధ్యతారాహిత్యంతో ఉన్నారనీ, ఇలాంటోళ్లు మాకెందుకు ఇక్కడ అన్నారు. ఒక ఆసుపత్రిని బాగుచేయాలనే పాజిటివ్ మైండ్ ఉన్నవాళ్లు కావాలనీ, కానీ మీరు వేసినవాళ్లు నెగెటివ్ మైండ్ తో ఉన్నారంటూ కామినేనితో చెప్పారు. శాఖాపరంగా ఇక్కడి అవసరాలకు నిధులు విడుదల చేయాలని ఎన్నిసార్లు చెబుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. ఇలాగైతే స్థానిక ప్రజలకు తాను ఏం చెప్పుకోవాలన్నారు. సామర్లకోట ఆసుపత్రి విషయంలో మీతోపాటు మీ శాఖ కూడా పూర్తి నిర్లక్ష్య వైఖరితో ఉందని కామినేని నేరుగా విమర్శించారు.
భాజపా మంత్రి కామినేనిపై చినరాజప్ప ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. నిజానికి, ఈ మధ్య రాష్ట్ర భాజపా నేతల తీరుపై చినరాజప్ప చాలా ఆగ్రహంగా ఉన్నారు. సరిగ్గా ఓ మూడురోజుల కిందటే ఆయన మట్లాడుతూ… వైకాపా, భాజపాల మధ్య రహస్య ఒప్పందం జరిగిందని ఆరోపించారు. లేకుంటే, కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడతామని జగన్ అంటుంటే, ఆ వ్యాఖ్యలపై రాష్ట్ర భాజపా నేతలు ఎందుకు స్పందించడం లేదంటూ మండిపడ్డారు. మరి, ఆ కోపం ఎలాగూ ఉండనే ఉంది కాబట్టి.. ఈ సందర్భంలో ఇలా బయటకి వచ్చిందేమో మరి.