తెలంగాణలో మంత్రి వర్గం ప్రమాణం చేయగానే శాఖలను కేటాయించేశారన్న ఓ వార్త వైరల్ అయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డికి హోంశాఖ.. భ ట్టి విక్రమార్కకు రెవిన్యూ ఇచ్చినట్లుగా చెప్పుకున్నారు. సాయంత్రం వరకూ అదే హైలెట్ అయింది. నిజానికి శాఖల కేటాయింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ అంశంపై ముఖ్యమంత్రి కార్యాలయం ఓ స్పష్టత ఇచ్చింది. కేబినెట్ మీటింగ్ ముగిసిన తర్వాత ఓ ప్రకటన విడుదల చేశారు. మంత్రులకు ఎలాటి శాఖలు కేటాయించలేదని.. కేటాయించిన తర్వాత అధికారిక ప్రకటన విడుదల చేస్తామని స్పష్టం చేశారు. దీంతో వైరల్ అయిన మంత్రుల జాబితా అంతా ఫేక్ అని తేలిపోయింది.
రేవంత్ కేబినెట్ లో హోంమంత్రి పదవి అత్యంత కీలకమైనది. పదేళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ నేతల్ని ఇబ్బంది పెట్టిన వారితో పొలిటికల్ స్కోర్స్ సెటిల్ చేసుకోవాలని రేవంత్ రెడ్డి అనుకోకుండా ఉండరు. బీఆర్ఎస్ తో పెద్దగా లడాయి పెట్టుకోని.. వారితో సంబంధాలు ఉన్నట్లుగా ప్రచారం ఉన్న వారిని హోంగా పెట్టుకుంటే… ఇబ్బంది అవుతుంది. అందుకే రేవంత్ రెడ్డి హోంమంత్రిగా తనకు బాగా సన్నిహితుల్నే పెట్టుకుంటారని భావిస్తున్నారు.
హోంమంత్రిగా సీతక్క పేరు ప్రచారంలోకి వస్తోంది. లేకపోతే కొండా సురేఖకు చాన్సివ్వచ్చని అనుకుంటున్నారు. ఇద్దరూ రేవంత్ కు గట్టి విధేయులే. ఫైర్ బ్రాండ్ లీడర్లే. స్వతంత్రంగా పని చేయదగ్గవారే. పైగా మహిళలకు కీలక శాఖ ఇచ్చారన్న ఇమేజ్ కూడా ఉంటుంది. ఇతర ప్రాధాన్య శాఖలను సీనియర్లను కేటాయించే అవకాశం ఉంది. శనివారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అవి అయిపోయిన తర్వాత శాఖలు కేటాయించే అవకాశం ఉందని భావిస్తున్నారు.