హిజ్బుల్ ఉగ్రవాది బుర్హాన్ ముజాఫర్ వనీ ఎన్కౌంటర్ కారణంగా కాశ్మీర్ రగులుతోంది. భద్రతాదళాలు, నిరసనకారులకి మధ్య జరుగుతున్న ఘర్షణలలో ఇంతవరకు 30మంది చనిపోయారు. విచిత్రమైన విషయం ఏమిటంటే బుర్హాన్ ముజాఫర్ వనీ మృతికి నిరసనగా ఆందోళన చేస్తున్న వారిలో చాలా మందికి నిన్న మొన్నటి వరకు అతనెవరో కూడా తెలియదు. అతనొక భారత్ ఏజెంట్ అని నమ్మేవారు. అటువంటి వ్యక్తి కోసం నేడు కాశ్మీర్ యువత ఆందోళన చేస్తోందంటే వారిని వేర్పాటువాదులు ప్రోత్సహిస్తున్నారని నమ్మకతప్పదు. భద్రతాదళాలు ఎంతగా ప్రయత్నిస్తున్నా కాశ్మీర్ లో పరిస్థితులు సాధారణస్థితికి రాకపోవడంతో, ఈ సమస్యని రాజకీయంగా పరిష్కరించేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది.
విశేషమేమిటంటే ఈసారి కాంగ్రెస్ పార్టీ కూడా అందుకు సహకరించడానికి సిద్దపడింది. జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో అధికార పిడిపితో బాటు కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ తదితర పార్టీల సహకారం కూడా తీసుకొని, కాశ్మీర్ లో అశాంతి సృష్టిస్తున్న శక్తులని నియంత్రించేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఏ ప్రభుత్వమైనా ఇలాగే ప్రయత్నిస్తుంది. కానీ ఇందులో కూడా తప్పకుండా చెప్పుకోవలసిన విశేషం మరొకటుంది.
కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ నిన్న వైకాపా ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డికి ఫోన్ చేసి కాశ్మీర్ ఘటనలపై వైకాపా వైఖరి ఏమిటో తెలియజేయమని కోరారు. ఆ సమయంలో ఆయన హోం మంత్రి పక్కనే ఉండి ఉంటే, యాదృచ్చికంగా అడిగారని సరిపెట్టుకోవచ్చు. కానీ మేకపాటి నెల్లూరులో ఉన్నప్పుడు డిల్లీ నుంచి హోం మంత్రి నుంచి ఫోన్ రావడమే చాలా విచిత్రంగా ఉంది. కాశ్మీర్ హింసాత్మక ఘటనలపై విచారం వ్యక్తం చేసి, పార్టీ వైఖరి గురించి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి చెపుతానని మేకపాటి హోం మంత్రికి తెలిపారు.
కాశ్మీర్ లో పరిస్థితులని చక్కదిద్దవలసిన బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వానిది, కేంద్రప్రభుత్వానిదే. అందుకోసం మోడీ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలని, కాంగ్రెస్ ని సంప్రదించడం చాలా సహజమే. మోడీ ప్రభుత్వం తన ఎన్డీయే భాగస్వాములకి ఆ వివరాలు తెలియజేసి వాటి వైఖరి, సలహాలు, సూచనలు కోరినా అర్ధం ఉంటుంది. కానీ వైకాపా ఏమీ కేంద్రప్రభుత్వంలో భాగస్వామి కాదు. కనీసం భాజపాకి మిత్రపక్షం కూడా కాదు. పైగా కాశ్మీర్ సమస్యలతో దానికి అసలు సంబంధమే లేదు. దానిని తన వైఖరి చెప్పమని హోం మంత్రి కోరడం దేనికో అర్ధం కాదు.
ఒకవేళ మోడీ ప్రభుత్వం ఈ సమస్యపై దేశంలో అన్ని పార్టీల వైఖరిని, వాటి సలహాలని, సూచనలని స్వీకరించి అడుగు ముందుకు వేయాలనుకొంటే వాటితో డిల్లీలో సమావేశం ఏర్పాటుచేయవచ్చు. కానీ ఇటువంటి సమస్యలలో కేంద్రప్రభుత్వం ఆవిధంగా చేయవలసిన అవసరమేమీ లేదు. ఒకవేళ అందరి సలహాలు తీసుకోదలిస్తే ఎవరూ కాదనరు. అధికారంలో లేని ఒక ప్రాంతీయ పార్టీ అయిన వైకాపా వైఖరిని హోం మంత్రి తెలుసుకోవాలనుకోవడమే చాలా విచిత్రంగా ఉంది.