వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధితుల శిబిరం అంటూ.. టీడీపీ ఏర్పాటు చేసిన క్యాంప్‌పై… హోంమంత్రి స్థానంలో ఉన్న సుచరిత… తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఆ శిబిరంలో ఉన్న వారంతా పెయిడ్ ఆర్టిస్టులేనని… పదే పదే వ్యాఖ్యానిస్తూ వచ్చారు. వారిని బాధితులుగా గుర్తించడానికి.. పూర్తి స్థాయిలో నిరాకరించారు. నిన్నటి వరకూ వారంతా పెయిడ్ ఆర్టిస్టులేనన్నారు. కానీ గురువారం మాత్రం.. వారిని బాధితులుగానే సంబోధించారు. ముఖ్యమంత్రితో జరిగిన సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన హోంమంత్రి సుచరిత ఎక్కడా పెయిడ్ ఆర్టిస్టులనే పదం వాడలేదు. అందర్నీ బాధితులుగానే సంబోధించారు. అయితే.. టీడీపీతో పాటు.. వైసీపీలోనూ బాధితులున్నారని కవర్ చేసుకున్నారు.
వైసీపీ గెలిచిన తర్వాత ఆ పార్టీ కార్యకర్తల దాడులకు భయపడి… ఊళ్లొదిలి వెళ్లిపోయిన వారి సమస్యను… అధికార పార్టీ మొదటి నుంచి తేలిగ్గా తీసుకుంది. పెయిడ్ ఆర్టిస్టులంటూ.. కించ పరిచే వ్యాఖ్యలు చేసింది. పార్టీ పరంగా… చాలా మంది అలాంటి విమర్శలు చేసినా.. తేలిపోయాయి. అయితే.. హోంమంత్రి హోదాలో ఉండి.. పార్టీలకు అతీతంగా… ఏపీ ప్రజలందరికీ.. రాజ్యాంగపరమైన హక్కులు పొందేలా చూడాల్సిన హోంమంత్రి కూడా… వారిని కించపరిచేలా మాట్లాడారు. వారి గురించి పూర్తిగా తెలుసుకోకుండానే… పెయిడ్ ఆర్టిస్టులని ఎద్దేవా చేయడం ప్రారంభించారు. అంతే కాకుండా.. వైసీపీ నేతలు పోటీగా ఏర్పాటు చేసిన … శిబిరానికి వెళ్లి తీవ్ర విమర్శల పాలయ్యారు.
హోంమంత్రి పెయిడ్ ఆర్టిస్టులన్న వారినే పోలీసులు… ఐదు బస్సుల్లో.. వారి వారి గ్రామాలకు తీసుకెళ్లారు. వారిపై ఎవరెవరు దాడులకు పాల్పడ్డారో.. వారి వివరాలు తీసుకున్నారు. అలాంటివారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. మరోసారి దాడులు జరగకుండా… చూసేలా జాగ్రత్తలు తీసుకున్నారు. పోలీసులు తీసుకెళ్లిన వారిలో ఒక్కరంటే.. ఒక్కరు కూడా బాధితులు కాని వారు లేరు. అందరూ… వైసీపీ కార్యకర్తల దాడులకు భయపడి.. ఊళ్లొదిన వాళ్లే. గ్రామాలకు సంబంధం లేని వారు ఒక్కరు ఉన్నా… ఆ విషయాన్ని వైసీపీ నేతలు చిలువలు పలువలుగా చెప్పేవారు. కానీ ఒక్కరు కూడా… అలాంటి వారు లేరు. ఈ విషయంలో హోంమంత్రికి రిమార్కులు పడినట్లేనన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఏర్పడింది.