ఇప్పుడు ఇళ్లు కొనాలంటే ఖచ్చితంగా హోమ్ లోన్ ఉండాల్సిందే. మధ్యతరగతి జీవులు అంతా హోమ్ లోన్ మీదనే ఆధారపడి ఇళ్లు కొంటారు. అయితే వీలైనంత త్వరగా రుణాన్ని తీర్చేసుకోవాలని ఆశ పడుతూంటారు. అందుకే ఖర్చులని పూర్తిగా నియంత్రించుకుని ఎంత పోగుపడితే అంత కట్టేస్తూ ఉంటారు. కొంత మంది ఈఎంఐ పెంచుకుంటూ ఉంటారు. ఇలా ఈఎంఐ పెంచుకోవడం మంచిదా కాదా అన్నదానిపై ఆర్థిక నిపుణులు అనేక రకాల విశ్లేషణలు చేస్తూంటారు.
ఈఎంఐ పెంచుకోవడం అనేది అంతిమంగా మంచి నిర్ణయం అవుతుంది. అయితే ఇలా పెంచుకోవడం వల్ల తమ ఆదాయంలో ఎక్కువగా హోమ్ లోన్‌కు కట్టేసుకుని ఇతర అవసరాలకు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తే మాత్రం దాని వల్ల ఉపయోగం ఉండదని అంటున్నారు. ఆదాయం ఈఎంఐ పెంచుకోవడానికి తగ్గట్లుగా ఉంటే మాత్రం మంచి నిర్ణయం. కానీ ఇతర అవసరాలకు ఉగ్గబట్టుకుని తర్వాత వాటిపై ఎక్కువ అప్పులు చేయాల్సి వస్తే మాత్రం మంచి నిర్ణయం కాదని అనుకోవచ్చు.
ఈఎంఐ మొత్తాన్ని పెంచుకోవడం వల్ల .. కట్టే నెలలు తగ్గిపోతాయి. పదేళ్ల లోపు లోన్ అయితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. పదిహేనేళ్లు కట్టేసిన తర్వాత ఈఎంఐ పెంచుకున్నా వచ్చే ప్రయోజనం తక్కువే ఉంటుందని లెక్కలు వేసుకోవచ్చు. దానికి బదులుగా మొత్తం ఒకే సారి కట్టే ప్లాన్ చేసుకోచ్చని చెబుతున్నారు. అదే సమయంలో పన్ను మినహాయింపుల ను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇతర పన్ను మినహాయింపు ఆప్షన్లు ఉంటేనే ముందస్తు చెల్లింపులు చేయాలి లేకపోతే.. పెద్దగా ప్రయోజనం ఉండదు.