హైదరాబాద్: భారత సంతతికి చెందిన నోబుల్ బహమతి గ్రహీత వెంకటరామన్ రామకృష్ణన్ హోమియోపతి వైద్య విధానాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. హోమియోపతి వైద్యులు ఆర్సెనిక్ మిశ్రమాలను తీసుకుని ఒక్క అణువు మాత్రమే ఉండేవరకు వాటిని పలచన చేస్తారని అన్నారు. వాటివలన ఎటువంటి ప్రయోజనమూ ఉండదని చెప్పారు. ట్యాప్‌లో వచ్చే నీళ్ళలోనే ఇంకా ఎక్కువ ఆర్సెనిక్ ఉంటుందని అన్నారు. రసాయన శాస్త్రంలో ఎవరూ హోమియోపతిని నమ్మరని చెప్పారు. కేవలం ప్లాసిబో ఎఫెక్ట్ వలనే హోమియోపతి పనిచేస్తుందని అన్నారు. జ్యోతిష్యాన్ని కూడా వెంకటరామన్ విమర్శించారు. గ్రహాలు, నక్షత్రాలు మనుషుల జాతకాలను మారుస్తాయని చెప్పటానికి ఎటువంటి శాస్త్రీయమైన ఆధారాలూ లేవని అన్నారు. పుట్టిన సమయం జీవితంపై ప్రభావం చూపుతుందనటానికి కూడా రుజువులు లేవని చెప్పారు. ఒకసారి నమ్మకాలు ఏర్పడితే అవి తొలగిపోవటం కష్టమని అన్నారు. హోమియోపతి ఇండియాలో పుట్టిందన్న వాదనను కొట్టిపారేస్తూ, ఈ వైద్య విధానం జర్మనీలో ప్రారంభమయిందని చెప్పారు. 2009లో రసాయన శాస్త్రంలో నోబుల్ బహుమతి గెలుచుకున్న వెంకటరామన్, చండీగఢ్‌లోని పంజాబ్ యూనివర్సిటీలో హరగోవింద్ ఖొరానా స్మారక ఉపన్యాసం ఇవ్వటానికి ఇటీవల ఇండియా వచ్చారు.