స్వలింగ సంపర్కం నేరం కాదని సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది. ఐపీసీ సెక్షన్ 377ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై తుది తీర్పు వెలువడింది. ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో నలుగురు న్యాయమూర్తులు ఏకాభిప్రాయం వెలిబుచ్చారు. దీంతో పరస్పర అంగీకారంతో జరిగే స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సంచలన తీర్పునిచ్చింది. వ్యక్తిగతంగా తమకు నచ్చిన భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉందని తీర్పులో పేర్కొంది. భావవ్యక్తీకరణను నిరాకరించడం అంటే అది మరణంతో సమానమని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
స్వలింగ సంపర్కం నేరం కిందకే వస్తుందంటూ 2013 సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును సమీక్షించి.. పూర్తి విరుద్ధమైన నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ప్రకటించింది. ప్రధానంగా ఈ కేసు “ఐపీసీ సెక్షన్377” గా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఈ సెక్షన్‌కింద ప్రకృతి విరుద్ధంగా జరిగే లైంగిక సంపర్కం నేరం. ఈ నేరం కింద జీవితఖైదు లేదా పదేళ్ల జైలు విధించే అవకాశం వుంది. అయితే ఈ సెక్షన్ 1861లో నుంచి భారత శిక్షా స్మృతిలో ఉంది. ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ.. 2001లో నాజ్ఫౌండేషన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఢిల్లీ హైకోర్టు కూడా.. స్వలింగ మనుషులైనా.. పరస్పర అంగీకారంతో జరిగే సెక్స్ నేరం కాదని తీర్పు చెప్పింది. ఈ తీర్పును కొంత మంది సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. విచారణ అనంతరం.. 2013 డిసెంబర్లో ఢిల్లీ హైకోర్టు తీర్పును కొట్టివేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది.
మారుతున్న ప్రపంచంలో ఇప్పుడు…స్వలింగ సంపర్కం అనేది అనేక దేశాల సంస్కృతి, సంప్రదాయాలకు ఓ సవాల్‌గా మారింది. కొన్ని దేశాలు.. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని.. స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేశాయి. భారత్‌లో ఇద్దరు మగవాళ్లు, ఇద్దరు ఆడవాళ్లు అలింగనం చేసుకున్నా వింతగా చూస్తారు. అలాంటి దేశంలో స్వలింగ సంపర్కం, స్వలింగ వివాహాలకూ మద్దతు దొరకడం అంత తేలిక కాదు. న్యాయస్థానం అంగీకరించినా.. మోరల్ పోలిసింగ్ ఎక్కువగా ఉండే భారతదేశంలో అలాంటి స్వేచ్ఛ అనుభవించడం అంత తేలిక కాదు. ఇప్పటికే 26 దేశాల్లో స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేశారు.