ఎట్టకేలకు గత కొద్ది కాలంగా పోలీసులని ముప్పు తిప్పలు పెడుతున్న డేరా బాబా దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్ను మంగళవారం పంచకుల పోలీసులు అరెస్టు చేశారు. పంజాబ్లోఆమెను హరియాణా పోలీసులు అరెస్టు చేసినట్లు పంచకుల పోలీస్ కమిషనర్ ఏఎస్ చావ్లా ధ్రువీకరించారు. ఆమె వెంట ఉన్న మరో మహిళను కూడా అదుపులో తీసుకున్నారు.
గత కొద్ది రోజులుగా హనీ ప్రీత్ మీద మీడియాలో , సోషల్ మీడియాలో రకరకాల కథనాలు రావడం తెలిసిందే. అసలు ఈమెకి, బాబా కి మధ్య తండ్రీ కూతుళ్ళ సంబంధం కాకుండా వేరే రకమైన అనుబంధం ఉందని ప్రధాన ఛానెళ్ళలోనూ కథనాలూ దర్శనమిచ్చాయి. గుర్మీత్ కు న్యాయస్థానం జైలుశిక్ష విధించినప్పటి నుంచి హనీప్రీత్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆమె కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. గుర్మీత్ కేసు తీర్పు సమయంలో చెలరేగిన అల్లర్లలో ప్రధాన సూత్రధారిగా ఆమెపై అభియోగాలు ఉన్నాయి. హనీప్రీత్ సంకేతాల ఇవ్వడంతోనే డేరా మద్దతుదారులు, అనుచరులు హింసకు పాల్పడినట్లు పోలీసులు గతంలోనే తెలిపారు.