రాజకీయాల్లో ఉండేవారు చాలా జాగ్రత్తగా ఉంటారు. తమపై ఎన్నెన్ని కుట్రలు జరుగుతాయో వారికి తెలుసు. కర్ణాటకలో అయితే మరీ ఎక్కువ. అక్కడ ఆ కుట్రలన్నీ ఎక్కువగా హనీ ట్రాప్లుగానే ఉంటాయి. ఎంతో మంది నేతలు ఈ హనీ ట్రాప్ లో పడి.. వీడియోలు రిలీజ్ అయిన తర్వాత ముఖం చూపించుకోలేక ఇబ్బంది పడ్డారు. అయినా వారి రాజకీయ జీవితాలకు వచ్చిన ముప్పేమీ లేదు. కొంత మంది అసెంబ్లీలోనే పోర్న్ చూస్తూ దొరికిపోయారు కూడా. ఇప్పుడు మళ్లీ తాము హనీ ట్రాప్ లో చిక్కుకున్నామని వారు ఆందోళన చెందుతున్నారు. ఏకంగా అసెంబ్లీలోనే దీనిపై చర్చ పెట్టుకున్నారు.
కర్ణాటక నేతలు తమపై హనీ ట్రాప్లు జరుగుతాయని ఊహిస్తారు. వలచి వచ్చే మహిళలు హనీ ట్రాప్ కోసం వచ్చారని కూడా ఊహించగలరు. కానీ వారిని వారు తమాయించుకోవడం కష్టం అన్నట్లుగా చిక్కిపోతారు. తర్వాత బ్లాక్ మెయిలింగ్ కు నలిగిపోతారు. బేరాలు కుదరక వీడియోలు బయటకు వస్తే పరువు మొత్తం పోతుంది. ఇప్పుడు ఎలాంటి వీడియోలు బయటకు రాకపోయినా.. ఎమ్మెల్యేలు చాలా మంది హనీ ట్రాప్ వలలో చిక్కిపోయామని ఎందుకు అనుకుంటున్నారో .. ప్రజలు ఊహించగలరు. ఇప్పుడు వారు బ్లాక్ మెయిలింగ్ ఒత్తిడికి గురవుతున్నారని అందుకే అసెంబ్లీలో బాధపడుతున్నారని అనుకుంటే అందులో తప్పేం ఉండదు.
దేవేగౌడ మనవడు ప్రజ్వల్ దగ్గర నుంచి సతీష్ జార్కిహోళి అనే సీనియర్ నేత వరకూ.. పదుల సంఖ్యలో సీనియర్ నేతలు హనీ ట్రాప్ కు గురయ్యామని చెబుతూ ఉంటారు. అయితే వారంతా.. మహిళల్ని లోబర్చుకున్నారని ఎక్కువ మంది అంటారు. కారణం ఏదైనా కర్ణాటక అసెంబ్లీలోని నేతలకు మాత్రం హనీ ట్రాప్ అనేది.. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ఓ భూతంగా వెంటాడుతోంది. అక్కడ రాబోయే రోజుల్లో కొన్ని కీలక వీడియోలు వైరల్ అయినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.