” చిన్న దొంగతనం చేసిన వాడిని దొంగ అని వెంటపడి కొడుతున్నాం..! అదే పెద్ద దొంగతనం, స్కాం చేసిన వాళ్లను హీరో అంటున్నారు..!… ఈ పరిస్థితి చూసి నాకు భయం వేస్తోంది..!…” ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఓ సందర్భంలో చేసిన వ్యాఖ్యలు ఇవి. ఆయన ఏ సందర్భంలో చేశారో కానీ… ప్రస్తుత పరిస్థితులకి.. సరిగ్గా సరిపోతున్నాయి. ఆయన వ్యాఖ్యను మరో విధంగా వాడుకుని.. ఆ చిన్న దొంగతనం కేసుల్ని… పెద్దలపై మోపి.. చాలా పకడ్బందీగా… పరువు హత్యలు చేస్తోంది.
పరువు తీస్తే ప్రాణం తీసుకుంటారనే క్రూర ఆలోచనలు..!
పెట్టీ కేసు పెడితేనే దశాబ్దాల పాటు రాజకీయాల్లో తెచ్చుకున్న పేరు, పరువు పోయిందని కోడెల ప్రాణం తీసుకున్నారు. గత మూడు నెలల కాలంలో కోడెల కుటుంబంపై 19 కేసులు పెట్టారు. చివరికి అసెంబ్లీ ఫర్నీచర్ విషయంలోనూ అదే చేశారు. తీసుకెళ్లమని చెప్పినా.. దొంగతనం కింద కేసు పెట్టారు. పల్నాటి పులిగా పేరు పొంది.. దశాబ్దాల రాజకీయాన్ని నడిపిన కోడెల.. ఈ తీరుతో తట్టుకోలేకపోయారు. ఆత్మాభిమానాన్ని చంపుకోలేక ప్రాణం తీసుకున్నారు. ఒక్క కోడెల మాత్రమే కాదు.. టీడీపీ నేతలందరిపైనా ఈ కేసులు నమోదయ్యాయి. చట్టాన్ని, రాజ్యాంగాన్ని పట్టించుకోకుండా.. పెట్టే కేసులు పెట్టీ కేసులైనా సరే.. అప్పటికప్పుడు పరువు తీయడానికి ఉపయోగపడుతుందని… సై అంటున్నారు.
కూన నుంచి నన్నపనేని వరకూ అందరిపైనా అదే తరహా ఫ్యాక్షన్ ..?
కూన రవికుమార్ అనే నేత దగ్గర్నుంచి నన్నపనేని అనే 70 ఏళ్లు దాటిన మహిళా నేతనూ.. వైసీపీ నేతలు.. పరువు హత్య ల కోసం ఎంచుకున్నట్లుగా మూడు నెలల్లో జరిగిన పరిణామాలు నిరూపిస్తున్నాయి. సోమిరెడ్డినీ వదల్లేదు. దశాబ్దాల కిందటి ఓ వివాదంతో కేసు నమోదు చేసి సోమిరెడ్డి ఎక్కడికీ వెళ్లకపోయినా.. పరారైనట్లు జగన్ మీడియాలో రాసేసి.. పరువు హత్యకు మొదటి ప్రయత్నం చేశారు. నిజానికి సోమిరెడ్డి పోలీసు విచారణకు వెళ్లి అన్ని డాక్యుమెంట్లు ఇచ్చి వచ్చారు. సీనియర్ నేత నన్నపనేని రాజకుమారిపై … మరీ దారుణంగా విషప్రచారం చేశారు. ఆమె పోలీసు అధికారిని కులం పేరుతో దూషించినట్లుగా ప్రచారం చేశారు. కానీ ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టలేదు. ఎందుకంటే ఆమె అనలేదు. కానీ సాక్షి పేపర్లో మాత్రం… ప్రచారం చేసి.. ఆమెకు మనోవ్యధను మిగిల్చారు. తననూ ఆత్మహత్య చేసుకునేలా చేస్తున్నారని.. ఆమె పోలీస్ స్టేషన్లోనే కన్నీరు పెట్టుకున్నారు. పరువు హత్యకు ఇదే కదా అసలైన ప్రయత్నం..!
వ్యక్తిత్వాన్ని హత్య చేసి చేసే రాజకీయానికి విలువుందా..?
నేరుగా హత్య చేయడం కాకుండా.. వ్యక్తిత్వాన్ని హత్య చేయడం అనే విధానాన్ని నయా ఫ్యాక్షన్ రాజకీయం పాటిస్తోందన్న అభిప్రాయం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఉన్న వారికి సులువుగానే అర్థమైపోతుంది. దానికి కూడా కోడెల ఎదుర్కొన్న పరిస్థితులే సాక్ష్యం. నాగార్జున యూనివర్శిటీలో ఏసీబీ దాడుల్లో దొరికిన ఓ ఉద్యోగికి.. కోడెలకూ లింక్ పెట్టేశారు. అలాంటివి కోకొల్లలు. అబద్దపు ప్రచారాన్ని ఎదుర్కోని టీడీపీ నేత లేరంటే అతిశయోక్తి కాదు. దీన్ని బట్టి చూస్తేనే ఏపీలో టీడీపీ సీనియర్ నేతల వ్యక్తిత్వాన్ని హత్య చేయడానికి ఎక్కడ.. ఎలాంటి ప్రణాళికలు అమలవుతున్నాయో.. తెలిసిపోతోంది.