ఇటీవల కన్నుమూసిన మాజీ కేంద్ర మంత్రి పి.శివశంకర్‌కు నివాళి అర్పించేందుకు వెళ్లినప్పుడు కొన్ని ఉద్రిక్త ఘట్టాలు గుర్తుకు వచ్చాయి. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా వుండగా శివశంకర్ ఆయనతో వాగ్వాదం వేసుకోవడం అప్పట్లో పెద్ద వార్త. మేమంతా దాన్ని ఖండించాము కూడా. అయితే అసలు ఒక బలమైన ముఖ్యమంత్రితో అంత వాదన వేసుకునే పరిస్థితి వారికి ఎలా వచ్చివుంటుందనే ఆలోచన కూడా కలిగింది. ఇక్కడ శివశంకర్, జలగం వెంగళరావు, బెంగాల్లో ఘనీఖాన్ చౌదరి, కేరళలో కరుణాకరన్ వంటివారు తరచూ అక్కడి ప్రతిపక్ష ప్రభుత్వాలతో ఘర్షణ పడేవారు. రాజకీయంగా తప్పు అయినా వ్యక్తులుగా వారి పట్టు ప్రదర్శించేవారు. అయితే గత రెండు మూడు దశాబ్దాలలో ఈ పరిస్థితి వుందా అంటే పూర్తిగా మారిపోయింది. కాంగ్రెస్ బలహీనపడటం, బిజెపి ప్రాంతీయ పార్టీలతో కలసి ఎన్‌డిఎ ఏర్పాటు చేయడం తర్వాత యుపిఎ అధికారం ఇవి కేంద్ర మంత్రుల పాత్రను తగ్గించి వేశాయి. ఆ రెండు పెద్ద పార్టీలు మనుగడ కోసం ప్రాంతీయ నేతలను సంతృప్తిపర్చడంకోసం పాకులాడవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేతలు తాము తమ వారసులు తప్ప మరెవరూ కేంద్ర పదవులతో బలపడటం అనుమతించరు. పదవుల కన్నా ప్రయోజనాలు మిన్న అని చెబుతుంటారు గాని వాస్తవానికి అసలు ఉద్దేశం వారు పెరగవద్దనే. ఎన్టీఆర్ హయాంలో విపిసింగ్ ఉపేంద్రను కేంద్రంలోకి తీసుకుంటానంటే విముఖంగా వున్నారు. సింగ్ కన్వీనర్లందరూ మంత్రులనే ఫార్ములాతో ఉపేంద్రను తీసుకున్నారు.
చంద్రబాబు నాయుడు హయాంలోనూ ఎర్రం నాయుడు వేణుగోపాలాచారి వంటి వారు మంత్రులుగా వున్నా స్వంతంగా ఎదిగిపోకుండా తగు కట్టుదిట్టాలు చేశారని చెబుతారు. యుపిఎలో మంత్రిగా వున్న జైపాల్‌రెడ్డి గౌరవం పొందినా రాష్ట్రంలో పెద్దగాతలదూర్చడం లేదు. కెసిఆర్ కొద్దికాలం కేంద్రంలో వుండగా సమాంతర అధికార కేంద్రం కాగలిగారు. ముఖ్యమంత్రుల స్థాయిలోని లాలూయాదవ్, నితిష్ కుమార్, మమతా బెనర్జీ, ములాయం సింగ్ యాదవ్ వంటివారికి ఇతరులకూ చాలా తేడా వుంటుంది. ఇప్పుడు అశోక్ గజపతి రాజు ,బండారు దత్తాత్రేయ పరిమిత పాత్రే పోషిస్తుంటే సుజనా చౌదరి చక్రం తిప్పుతుంటారు. ఆయన పూర్తిగా చంద్రబాబు కనుసన్నల్లోనే పనిచేస్తారని చెప్పడానికి లేదు. సుజనా స్థానంలో లోకేశ్‌ను పంపిస్తామని కూడా కొద్దికాలం కథనాలు చలామణి చేశారు. మొత్తంపైన కేంద్ర మంత్రులకు గతంలోని ప్రాధాన్యత తగ్గిపోయిందనేది వాస్తవం. వెంకయ్య నాయుడు వంటి వారు ఘనంగా కనిపించినా మోడీ చట్రంలో చాలా పరిమితులున్నాయి. మోడీ దాదాపు అద్యక్ష తరహాకు తీసుకుపోవడం వల్ల మొత్తంగానే కేంద్ర మంత్రుల ప్రాభవం తగ్గుముఖం పట్టింది. వున్నంతలో ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులకే పట్టు వుంటుంది గనక కేంద్రీకరణ ద్వారా అదీ కోత కోయాలని ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎన్టీఆర్ ఒకప్పుడు అన్నట్టు కేంద్రం మిథ్య కాకున్నా కేంద్ర మంత్రులు మిథ్యగా మారుతున్నారనిపిస్తుంది. ఇదో చారిత్రక పరిణామమే.