ఇది మాయా ప్రపంచమ్మురా తమ్ముడూ.. ఈ మహిలో సదాశివుని మరువకు తమ్ముడూ… వెనకటికి ఒక సినిమాలో మాధవపెద్ది సత్యం పాడిన పాట ఇది. ఆయనకు చాలా ఇష్టమైన పాట కూడా. చాలా వేదాంత ధోరణిలో వుంటుంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల అగ్రనేతల మాటలు చూస్తుంటే ఈ పాటే గుర్తుకు వస్తుంది. ఒకరు తిడుతుంటారు. ఒకరు పొగుడుతుంటారు. ఒకే పార్టీలో ఒకరిని తిడుతుంటారు మరొకరిని పొగుడుతుంటారు. కొన్ని విషయాలపై రెచ్చిపోతారు. మరికొన్ని అంతకన్నా తీవ్రమైన విషయాలైనా మూగనోము పాటిస్తారు. ఇదంతా ఒక మాయా నాటకంలా తయారైంది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ బిజెపి అద్యక్షుడు అమిత్‌షాపై నిప్పులు కక్కుతారు. కాని ఆయనకూ దేశానికీ కూడా బాస్‌గా వున్న ప్రధాని మోడీపై గౌరవం వుందని మరీ మరీ చెబుతారు. అప్పుడెప్పుడో హైదరాబాద్ తెలంగాణలో వుంది గనక ప్రత్యేక రాష్ట్రం ఎందుకని వృద్ధనేత అద్వానీ అన్నందుకు ఇప్పుడు తిట్టిపోస్తారు. కాని 2014ి ఎన్నికల ప్రచారంలోనే అంతకంటే ఎక్కువే మాట్లాడిన మోడీని పల్లెత్తు మాట అనరు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డిఎకు ముద్దతునిస్తామని టిఆర్ఎస్ పార్లమెంటరీ నేత జితేందర్ రెడ్డి ప్రకటిస్తారు. కాని కెసిఆర్ ఆయనను ఏమీ అనకుండా మేమింకా నిర్ణయం తీసుకోవాలని మాత్రమే చెబుతారు.
తెలంగాణలో టిడిపితో పొత్తు వుండదని బిజెపి నేతలంటారు. ఎన్నికలవరకూ చర్చించవద్దని వారి అధినేత చంద్రబాబు నాయుడు అంటారు. కాంగ్రెస్‌తోనైనా పొత్తుకు సిద్ధమని రేవంత్ రెడ్డి అంటారు. ఎట్టిపరిస్థితుల్లో కాంగ్రెస్‌తో కలిసేది లేదని దయాకరరెడ్డి సర్దిచెబుతారు. టిటిడిపి మహానాడు వేదికపై రేవంత్ రెడ్డి కెసిఆర్ ప్రభుత్వాన్ని దుయ్య బడతారు. చంద్రబాబు ఆ వూసే లేకుండా సరిపెడతారు.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో సోమువీర్రాజు చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తుతారు. అయితే తాము భాగస్వామ్య పక్షమంటారు బాద్యత తీసుకోరు. కేశినేని నాని బిజెపి తో పొత్తువల్లనే నష్టపోయామంటారు. వెంటనే చంద్రబాబు నాయుడు బిజెపితో సంబంధాలపై ఎవరూ మాట్లాడొద్దని మందలిస్తారు.కాని మరోవైపున నాని నా వ్యాఖ్యలకు కట్టుబడి వున్నానని ప్రకటిస్తారు.
వైఎస్ జగన్ ఢిల్లీ వెళి ప్రధాన్లి మోడీని కలిసి వస్తారు. ఎపికి సంబంధించిన సమస్యలపై వినతిపత్రం ఇస్తూనే అందులో ఒక్కదానికి ఒప్పుకోని బిజెపికి రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ప్రకటించి వస్తారు. ఇలా మూడు ప్రాంతీయ పార్టీలూ బిజెపి చుట్టూనే తిరుగుతూ కూడా ఏదో అంటున్నట్టు నటిస్తుంటే జనం ఏమనుకోవాలి? ఇవి మాయా పాలిటిక్సు తమ్ముడూ అని పాడుకోవలసిందే కదా!