లాండ్ పూలింగ్ లో భూములివ్వని రైతుల నుంచి నిర్భంధంగా భూములు సేకరించే లాండ్ అక్విజేషన్ ప్రక్రియ అమరావతిలో లో మొదలైంది. 2013 చట్టం ప్రకారమే భూసేకరణ నోటీసులు జారీ అయ్యాయి. దీనిప్రకారం సగంమంది రైతుల సమ్మతి వుంటే తప్ప భూసేకరణ సాధ్యంకాదు. తాము ఐక్యంగా వుండి భూములు నిలుపుకోగలమన్న ఆశా, తెలుగుదేశం నాయకులు లేదా ప్రభుత్వం తమలో చీలికలు తెచ్చి భూములు తీసేసుకుంటారన్న నిరాశా అంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో 6 గ్రామాల రైతులను వెంటాడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లోని తుళ్లూరు మండలం నేలపాడు నుంచి భూ సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేలపాడులో 40 మంది రైతులకు చెందిన 28ఎకరాల భూమిని 2013 భూ సేకరణ చట్టం ద్వారా తీసుకోవడానికి జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేశారు. దీనిపై రైతులకు ఏవైనా అభ్యంతరాలుంటే నోటిఫికేషన్ జారీ చేసిన 60 రోజుల్లోగా తెలపవచ్చని పేర్కొన్నారు. అలాగే నోటిఫికేషన్ జారీ చేసిన 28 ఎకరాల్లో ఎలాంటి క్రయవిక్రయాలు జరపరాదంటూ నోటిఫికేషన్లో తెలిపారు.
లాండ్ పూలింగ్ ద్వారా నేలపాడు, ఉండవల్లి, పెనమాక, ఎర్రబాలెం, నిడమర్రు, భేతపూడి గ్రామాలు మినహా, 23 గ్రామాల్లో చాలా మంది రైతులు భూములు ఇచ్చారు. అప్పుడెవరైతే భూములివ్వలేదో వారి నుంచి అక్టోబర్ లోగా భూ సేకరణ చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ విధంగా దాదాపు 2 వేల ఎకరాల భూమిని సేకరించవలసి వుంది.ఇందులో భాగంగా మొదట నేలపాడు గ్రామ భూములకు లాండ్ అక్విజేషన్ నోటీసులు జారీ అయ్యాయి.
అయితే ఈ 6 గ్రామాల రైతులూ భూసేకరణను వ్యతిరేకిస్తున్నారు. ”రాజధాని నిర్మాణంలో వ్యవసాయ భూమలు ఉండకూడదన్న నిబంధన ఎక్కడా లేదు, ఎంత పెద్ద రాజధాని అయినా చుట్టుపక్కల వ్యవసాయం చేసుకునే వెసలుబాటు ఉంటుంది. చంద్రబాబు చెబుతున్న సింగపూర్‌తో పాటు హైదరాబాద్‌లో కూడా నగర శివారుల్లో వ్యవసాయం చేస్తున్నారు” అని వారుఉదహరిస్తున్నారు. ఏదేమైనా తమ భూములు మాత్రం ఇచ్చేది లేదని రాజధాని ప్రాంత రైతులు ఖరాకండిగా చెబుతున్నారు.
రాజధాని నిర్మాణానికి తమ భూములు అడ్డుగా ఉంటే.. వాటిని తీసుకుని గ్రామ రెవిన్యూ పరిధిలో మరో చోటైనా ఇస్తే వ్యవసాయం చేసుకుంటామని రైతులు అంటున్నారు.
ప్రభుత్వం 2013 భూ సేకరణ చట్టం ద్వారా భూములు తీసుకోవాలని చూస్తే, రైతుల అంగీకారంతోనే తీసుకోవాలని, నేలపాడు రైతులు స్పష్టం చేస్తున్నారు. మా భవిష్యత్ తరాల కోసం.. ఉన్న భూముల్ని కాపాడుకుంటామని రైతులు చెబుతున్నారు. ఇప్పటికే రాజధాని కోసం భూములిచ్చామని, ఉన్న భూమిలో సాగు చేసుకుని బతుకుతామని చెబుతున్నారు. భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ.. చంద్రబాబు బలవంతంగా భూములు లాక్కోరన్న ధీమాతో ఉన్నారు రైతులు.