భవిష్యత్తులో అమెరికాకు హిందువు కూడా అధ్యక్షుడయ్యే అవకాశాలున్నాయంటూ సంచలన ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా. వైట్ హౌస్ లో ఆయన చివరి ప్రెస్ మీట్ ఈ సంచలన వ్యాఖ్యలకు వేదిక అయ్యింది. ప్రతిభకు పెద్దపీట వేస్తూ, అందరికీ సమాన అవకాశాలు ఉన్నంతవరకూ అమెరికాలో… భవిష్యత్తులో మహిళలే కాదు, లాటిన్ దేశస్థులు, యూదులు, హిందువులు కూడా అధ్యక్షులుగా ఎన్నిక కావచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి జాతికీ, మతానికీ చెందిన ప్రతిభవంతులు అమెరికాలో ఎదుగుతున్నారనీ, అదే అగ్రరాజ్య బలమనీ ఆయన అన్నారు.
అమెరికాకు ఒక నల్లజాతీయుడు అధ్యక్షుడు అయ్యారు, మళ్లీ అలా జరిగే అవకాశం ఉందా అన్న విలేఖరుల ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానమిచ్చారు ఒబామా. ఈ దేశానికి అన్ని వర్గాలకు చెందినవాళ్లూ అధ్యక్షులయ్యే అవకాశం ఉందనీ, ఆ సమయానికి వాళ్లను ఏమని పిలవాలో ఎవరికీ తెలియదంటూ నవ్వేశారు ఒబామా. అమెరికాలో ఇప్పటికీ చాలామంది పౌరులు తమకు గుర్తింపులేదని భావిస్తున్నారని వ్యాఖ్యానించారాయన. తమను చిన్నచూపు చూస్తున్నారనీ, తమకు వచ్చిన అవకాశాలు తమ పిల్లలకు వస్తాయో రావోనని భయపడుతున్నారనీ అన్నారు. అలాంటివాళ్లే డొనాల్డ్ ట్రంప్ కు ఓటేసి గెలిపించారని చెప్పారు. మీడియా వల్లే తాము నిజాయతీగా ఉంటూ, మరింత కష్టపడి పనిచేస్తున్నామన్నారు. వైట్‌హౌస్ నుంచి మీడియాను దూరంగా ఉంచాలని ట్రంప్ భావిస్తున్న నేపథ్యంలో ఒబామా ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.