పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి తెలుగుజాతి ఆశలు చాలా వరకు ముడిపడి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీటివనరుల పరంగా రూపురేఖలు మారిపోతాయనే విశ్వాసం ఉన్నది. ఈ ఆశలన్నీ ఒక ఎత్తు.. ప్రస్తుతం జరుగుతున్న పనుల మందగమనం మరొక ఎత్తు. దీనికి సంబంధించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన పనుల వేగానికి చేస్తున్న చేటు మరొక ఎత్తు. ఇలాంటి నేపథ్యంలో పోలవరం ను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత.. ఆ పనుల నిర్వహణ కోసం కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన ప్రత్యేక అథారిటీ రెండేళ్ల వ్యవధిలో తొలిసారి సమావేశం కాబోతున్నది. పోలవరం అథారిటీ ఛైర్మన్ తొలిసారిగా ప్రాజెక్టును సందర్శించబోతున్నారు. అయితే ఈ తొలి అథారిటీ సమావేశం సందర్భంగా కీలకంగా ప్రస్తావనకు వస్తున్న విషయాలేమిటంటే… ప్రాజెక్టును పూర్తిగా కేంద్రానికి అప్పగిస్తే తప్ప.. దీని నిర్మాణం పూర్తయ్యే యోగం లేదని అర్థమవుతున్నది. కేంద్రం చేపడితే తమకు అభ్యంతరం లేదంటూ చంద్రబాబునాయుడు సర్కారు లేఖ రాయడం కాదు..
పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం పద్ధతిగా నిధులు కేటాయించడం లేదనే వరకే మనకు తెలుస్తున్న సంగతి. అయితే జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించిన తర్వాత.. పోలవరం నిర్మాణానికి ఏర్పాటుచేసిన ప్రత్యేక అథారిటీతో ఈ రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఒప్పందాన్ని కూడా పూర్తిగా చేసుకోలేదన్నది చాలా పెద్ద లోపం. జాతీయ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదంటూ మనం విలపించినంత మాత్రాన ప్రయోజనం ఉండదు. మాకు అప్పగించకుండా మేం నిధులెందుకు ఇస్తాం అంటూ కేంద్రం మొండికేయడం వల్లనే వేల కోట్ల రూపాయలు అవసరమైన ప్రాజెక్టుకు వంద కోట్ల రూపాయల ముష్టి మాత్రమే బడ్జెట్ లో లభించిందనని మనం మరచిపోకూడదు.
ఇప్పుడు అథారిటీ నిర్వహించబోతున్న తొలి సమావేశంలో ఈ అంశాలు అన్నీ చర్చకు వచ్చే అవకాశం ఉన్నది. కేంద్రంతో అసలు సంబంధం గానీ, ప్రమేయం గానీ అక్కర్లేదు అన్నట్లుగా.. కాంట్రాక్టర్ల ఎస్టిమేట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇష్టారాజ్యంగా రివైజ్ చేసేసిన తీరు కూడా ఈ సమావేశంలో చర్చకు రావొచ్చు. అయితే సమావేశంలో ఎన్ని మలుపులు ఉన్నప్పటికీ, చంద్రబాబునాయుడు సర్కారు పోలవరం ప్రాజెక్టును కేంద్రానికి పూర్తిస్థాయిలో అప్పగించడం అనే పర్వం పూర్తి కాకుండా.. అసలు ఆ ప్రాజెక్టు పనులు వేగం పుంజుకోవడం అనూహ్యం అని విశ్లేషకులు భావిస్తున్నారు.