అల్లు అర్జున్ – వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో `ఐకాన్` సినిమాని ప్రకటించి మరీ.. పక్కన పెట్టేశాడు దిల్ రాజు. `అల వైకుంఠపురములో`కంటే ముందే పట్టాలెక్కాల్సిన సినిమా ఇది. ఆ సినిమా పూర్తయిన తరవాతైనా ఉంటుందనుకున్నారు. కానీ వెంటనే `పుష్ష` హడావుడిలో పడిపోయాడు బన్నీ. `ఐకాన్` స్థానంలో `వకీల్ సాబ్`కి పట్టాలెక్కించి వేణు శ్రీరామ్ బాకీ తీర్చుకున్నాడు దిల్ రాజు. దాంతో.. `ఐకాన్` ప్రాజెక్టు శాశ్వతంగా పక్కన పెట్టేశారనిపించింది.
అయితే `ఐకాన్` పై ఆశలు సజీవంగానే ఉన్నాయని వేణు శ్రీరామ్ మాటల్లో అర్థం అవుతోంది. ఈ ప్రాజెక్టుపై బన్నీ ఇప్పటికీ ఆసక్తిగానే ఉన్నారని, చేతిలో ఉన్న సినిమాలు పూర్తవ్వగానే `ఐకాన్` మొదలవుతుందని స్పష్టం చేశారు వేణు. ఇప్పటికీ తాను బన్నీకి టచ్‌లోనే ఉన్నట్టు, ఐకాన్ మొదలైతే, అది బన్నీతోనే అని, ఎప్పటికైనా ఈ సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ బన్నీ కాకపోతే మరో హీరోతో ఈ సినిమా ఉంటుందన్న ప్రచారానికి.. వేణు శ్రీరామ్ ఇప్పుడు తెరదించినట్టైంది.
నిజానికి ఐకాన్ కాన్సెప్ట్ కి బన్నీథ్రిల్ అయ్యాడు. ఇదో ప్రయోగాత్మక సినిమా అని బన్నీ భావిస్తున్నాడు. మంచి కమర్షియల్ హిట్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో.. ఇలాంటి ప్రయోగాలు చేయడం శ్రేయస్కరం కాదనిపించి, ఐకాన్ స్థానంలో అల వైకుంఠపురములో పట్టాలెక్కించాడు. `నాపేరు సూర్య` గనుక హిట్ అయి ఉంటే.. `ఐకాన్` వెంటనే మొదలైపోయేది. ఆ సినిమా దెబ్బ కొట్టడంతో, కమర్షియల్ సినిమాతోనే బన్నీ ప్రయాణం చేయాల్సిరావడంతో `ఐకాన్` పక్కకు వెళ్లింది.