మెతక వైఖరితో ఉంటే.. కేంద్రం నిధులను ఎలా చిక్కిపోయేలా చేస్తోందో తాజా ఉదాహరణగా పోలవరం ప్రాజెక్ట్ నిలుస్తోంది. సహాయ, పునరావాసాలతో కలిపి… గత ప్రభుత్వం దాదాపుగా 55వేల కోట్లకు ఆమోదింప చేసుకుంది. దాని కోసం అప్పటి టీడీపీ ఎంపీ.. నాటి ఆర్థిక మంత్రిగా ఉన్న అరుణ్ జైట్లీపై తీవ్రమైన ఒత్తిడి చేశారు. కేంద్రంపై పోరాడారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత పరిస్థితి మారిపోయింది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆమోదం తెలిపిన అంచనాలకు కేంద్రం కొత్తకొత్తగా కొర్రీలు పెడుతోంది. తాజాగా… పోలవరంకు పెట్టే ఖర్చు 2013-14లో ఎంత ఉంటుందో అంతే ఇస్తామని చెబుతోంది. దీని వల్ల కనీసం ఇరవై వేల కోట్ల వరకూ అంచనాలు తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది.
పోలవరం ప్రాజెక్టుకు విభజన చట్టంలో జాతీయ హోదా కల్పించారు. ఆ తర్వాత 2013-14 ధరల ప్రకారం రూ.30,719 కోట్లుగా జలసంఘం నిర్ణయించింది. అయితే కేంద్రం వద్ద ప్రక్రియ ఆగి ఆగి సాగింది. ప్రాజెక్ట్ ప్రారంభమయ్యే సమయానికి 2017 అయింది. ఈ కారణంగా అప్పటి ధరల ప్రకారం మళ్లీ అంచనాలను తయారు చేశారు. కేంద్ర జలసంఘం సాంకేతిక సలహా కమిటీ రూ.55657 కోట్లుగా నిర్ణయించింది. అంచనాల సవరణ కమిటీ దాన్ని రూ.47,725 కోట్లకు తగ్గించింది. ఈ మొత్తానికి కేంద్ర జల్‌శక్తి మంత్రి ఆమోదముద్ర వేసి ఆర్థిక శాఖకు పంపారు. కానీ ఇప్పుడు హఠాత్తుగా యూటర్న్ తీసుకున్నారు.
ఇప్పుడు 2013-14 ధరల ప్రకారం అయ్యే వ్యయాన్ని చెల్లిస్తామని పెరిగిన ఖర్చుతో సంబంధం లేదని వాదిస్తోంది. అంతే కాదు.. విద్యుత్ ప్రాజెక్ట్, తాగునీటి సరఫరాకు చేసే ఖర్చును తాము భరించబోమని మెలిక పెడుతోంది. దీనికి కేంద్రం అన్ని స్థాయిలో ఆమోదం తెలిపితే..ఇక ఏపీకి పోలవరం ప్రాజెక్ట్ కోసం… కంటి తుడుపుగా రెండు మూడు వేల కోట్లు వస్తాయేమో కానీ భారీ మొత్తం వచ్చే అవకాశం లేదు. ఇప్పటికి కేంద్రం రూ. పదిహేను వేల కోట్లు పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చామని చెబుతూ వస్తోంది.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీకి వెళ్లిన తక్షణం ఏడాదిలో ఖర్చు పెట్టడానికి పోవలరానికి రూ. పదిహేను వేల కోట్లు కావాలని అడుగుతూ ఉంటారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కోసం.. ఈ సాయం అడగుతూ ఉంటారు. అయితే.. ఇప్పుడు మొత్తంగా కలిపి ప్రాజెక్ట్ నిధులకు టెండర్ పెట్టేసింది. ఏపీ సర్కార్ గట్టిగా అడగడానికి మొహమాటపడుతోంది. రాజకీయ పరమైన అంశాల్లో పరస్పర సహకారం తీసుకుంటున్నారు కానీ.. రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన అంశాల్లో మాత్రం కేంద్రంపై ఎలాంటి ఒత్తిడి తేవడం లేదు. ఫలితంగా ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడే అవకాశం కనిపిస్తోంది.