రాహుల్‌గాందీ కాంగ్రెస్ అద్యక్ష పీఠం అధిరోహిస్తే తమ పార్టీ పరిస్థితి కొంత మెరుగుపడ్డమే గాక తమలాటి కార్యకర్తలకు కూడా మంచి రోజులు వస్తాయని తెలుగురాష్ట్రాల్లో కాంగ్రెస్ యువనేతలు ఎదురు చూస్తున్నారు. ఎపిలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్‌ను ఇప్పటికీ నమ్ముకుని వున్న వారికి రాహుల్ ఆశాదీపంలా కనిపిస్తున్నారు. వాస్తవానికి వీరిలో కొందరికి ఇదివరకే రాహుల్‌తో సంబంధముంది. ఆయనకు తమ సూచనలు చేసి వచ్చిన అనుభవం వుంది. అయితే ఆయన వింటారు గాని చర్యలు తీసుకోరని వారు గతంలో ఫిర్యాదు చేస్తుండేవారు. ఇప్పుడు అలా అనడం లేదు. ఇలాటి వారంతా కొప్పుల రాజుతో కలసి మాట్లాడుతున్నారు. ఆశలు అకాంక్షలు వెల్లడిస్తున్నారు. టిఆర్ఎస్కు కాంగ్రెస్ గట్టిపోటీదారుగా వుందనే తెలంగాణలో కూడా పాత కాపుల ధాటికి వెనకబడిపోయిన యువ నేతలు రాహుల్ తమను ఆదరించి అవకాశం ఇస్తారనే ఆశలు వెలిబుచ్చుతున్నారు. ఆయన చాలా కాలంగా తన వంతు ప్రయత్నం చేస్తున్నా ఎఐసిసిలో పాత కాలపు తలకాయలు కొన్ని అడ్డుపడుతూ వచ్చాయని వీరి ఆరోపణ. ఇప్పుడు ఏకంగా ఆయనే అద్యక్షుడైపోతున్నాడు గనక ఇక ఎవరూ చేయగలిగింది వుండదనేది వారి ఆలోచనగా వుంది. టిడిపి నాయకుడు రేవంత్‌ను తీసుకోవడం ద్వారా రాహుల్ స్వంత శైలిని చూపించారని వీరంటున్నారు. రేపు ఆయన తెలంగాణ పర్యటనతో కొత్త వూపు వస్తుందని కూడా ఆశిస్తున్నారు.