‘విరూపాక్ష’ క్షుద్ర శక్తుల నేపధ్యంలో తయారయ్యే కథలకు కొత్త జోష్ తెచ్చింది. సరిగ్గా ప్లాన్ చేయాలే కానీ పాన్ ఇండియాని ఆకర్షించే కంటెంట్ ఈ జోనర్ లో సెట్ చేయొచ్చు. ఈమధ్య బాలీవుడ్ లోనూ హారర్ సినిమాల్ని బాగా చూస్తున్నారు. వందల కోట్లు గుమ్మరిస్తున్నారు. అందుకే ఇప్పుడు హీరోలు ఈ తరహా కథలతో రెడీ అవుతున్నారు.
అల్లరి నరేష్ ’12A రైల్వే కాలనీ’ ఈ జానర్ సినిమానే. ఆత్మలు చుట్టూ నడిచే హారర్ కథ. ఆత్మలతో మాట్లాడే పాత్రలో కనిపించబోతున్నారు నరేష్. పొలిమేర మేకర్ డాక్టర్ అనిల్ విశ్వనాథ్ షోరన్నర్‌గా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఈ వేసవిలోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
సుశాంత్ హీరోగా పృథ్వీరాజ్ ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో సుశాంత్ ది భూత వైద్యుని పాత్ర. ఆ పాత్రకు మరో కోణం కూడా వుంది. ఇది సూపర్ నేచురల్ థ్రిల్లర్. ఇందులో కూడా ఆత్మ, భూత వైద్యం కీలకం.
వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ కలయికలో రాబోతున్న కొరియన్ కనకరాజ్ కామెడీ హారర్ టచ్ వున్న కథే. ఇందులో కూడా ఆత్మలు, భూత వైద్యం ప్రధానంగా వుంటాయి. రాయలసీయ, కొరియన్ ఆత్మ బ్యాక్ డ్రాప్ లో కథని సెట్ చేసుకున్నాడు మేర్లపాక.
డైరెక్టర్ రమేష్ వర్మ కూడా హారర్ టచ్ తో ఓ కథని సిద్ధం చేస్తున్నారు. ఇందులో సెంట్రల్ పాయింట్ కూడా ఆత్మలు, భూతవైద్యమే. స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. ఓ యంగ్ హీరోతో ఈ సినిమాని అనౌన్స్ చేసే అవకాశం వుంది.
లాస్ట్ బట్ నాట్ లీయస్ట్ .. ప్రభాస్ నుంచి రాబోతున్న బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ రాజాసాబ్ కూడా హారర్ టచ్ వున్న కథే. మూడు తరాల ఆత్మలు, వాటి భావోద్వేగాలు, దుష్ట శక్తులు.. ఇలాంటి ఎలిమెంట్స్ కామెడీ మిక్స్ చేసి అందరూ ఆస్వాదించదగ్గ ఎంటర్ టైనర్ గా ఈ కథని సిద్ధం చేశారు మారుతి.
సూపర్ నేచురల్ ఎలిమెంట్ తో రాసుకున్న కథలకు ఆడియన్స్ ని థియేటర్స్ లోకి తీసుకొచ్చే సత్తా వుంటుంది. ఈరోజుల్లో ఆడియన్స్ కూడా ఓ కొత్త వరల్డ్ బిల్డింగ్ ని కోరుకుంటున్నారు. ఆడియన్స్ అభిరుచికి తగట్టుగానే ఈ సినిమాలు తయారౌతున్నాయి. మరి ఇందులో విజయాలు అందుకునే సినిమాలేవో చూడాలి.