హైదరాబాద్ నుంచి అమరావతికి ఏపి ఉద్యోగులు తరలిరావడం మొదలైంది. వారు ఏపి ఉద్యోగులే అయినప్పటికీ గత రెండు మూడు దశాబ్దాలుగా హైదరాబాద్ లోనే పనిచేస్తునందున, విజయవాడ, గుంటూరు నగరాలలో ఇమడటానికి మొదట్లో కొంత ఇబ్బందిపడక తప్పదు. మహిళా ఉద్యోగులకి ఇంకా ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు. వారి సమస్యలని గుర్తించిన ప్రభుత్వం వారు విజయవాడలో స్థిరపడేవరకు హాస్టల్ నిర్వహించాలని నిర్ణయించింది. అది చాలా మంచి నిర్ణయమేనని చెప్పవచ్చు. ప్రతీరోజు హైదరాబాద్ నుంచి రైల్లో వచ్చి పనిచేసి వెళ్లిపోవడం కంటే ప్రభుత్వమే ఏర్పాటు చేస్తున్న ఆ హాస్టల్లో ఉంటూ, వీలునప్పుడు హైదరాబాద్ వెళ్లి వస్తుండటం వారికీ, ప్రభుత్వానికి కూడా మంచిది. కనీసం ఆరు నెలల పాటు మహిళా ఉద్యోగులకి హాస్టల్ సౌకర్యం కల్పించడానికి ప్రభుత్వం సిద్దమైంది. మహిళా ఉద్యోగులకే కాకుండా పురుష ఉద్యోగులకి కూడా విజయవాడ, గుంటూరు నగరాలలో అపార్టుమెంటులలో సామూహిక వసతి సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
విజయవాడ తరలి వస్తున్న ఉద్యోగులకి ప్రభుత్వమే కాకుండా స్థానిక ప్రజలు కూడా అన్నివిధాల సకహకరించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగులని ఆదరించి వారికి అవసరమైన సహాయసహకారాలు అందించడం విజయవాడ, గుంటూరు ప్రజల బాధ్యత. ఉద్యోగులకి అండగా నిలబడి భరోసా కల్పిస్తే వారు కూడా త్వరగా కొత్త ప్రదేశంలో ఇమిడిపోగలరు. వేలాదిగా తరలివస్తున్న ఉద్యోగుల వసతి, ప్రభుత్వ కార్యాలయాల కోసం చాలా భవనాలు అవసరం. డిమాండ్ పెరిగింది కాబట్టి విజయవాడ, గుంటూరు నగరాలలో ఇంటి యజమానులు అద్దెలు చాలా విపరీతంగా పెంచేసినట్లు వార్తలు వస్తున్నాయి. అది సరైన పద్దతి కాదు. ఉద్యోగులు అందరూ విజయవాడకి తరలివచ్చి అక్కడి నుంచే పరిపాలన మొదలైతే, మొట్ట మొదట ప్రయోజనం పొందేది ఆ ప్రాంతాలలో నివసిస్తున్న వారే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి విజయవాడకి తరలివచ్చేసిన తరువాత నుంచి నగరంలో సుందరీకరణ పనులు అభివృద్ధి కార్యక్రమాలు జోరందుకోవడం గమనిస్తే ఆ విషయం అర్ధం అవుతుంది. కనుక హైదరాబాద్ నుంచి వచ్చే ఉద్యోగులు విజయవాడలో త్వరగా స్థిరపడేందుకు స్థానిక ప్రజలు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తే అందరికీ మేలు కలుగుతుంది. ఉద్యోగులు, ప్రభుత్వం, స్థానిక ప్రజలు అందరూ ఒకరికొకరు సహకరించుకోవడం చాలా అవసరం. రాష్ట్రాభివృద్ధి కోసం ఈ సమిష్టి కృషి ఇప్పుడు చాలా అవసరం కూడా.