జిల్లాల పర్యటనలు ప్రారంభించిన కేసీఆర్‌కు సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, కామారెడ్డి కలెక్టర్ శరత్ పాద నమస్కారాలు చేశారు. సమీకృత కార్యాలయాలను కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భాల్లో చాంబర్లో కలెక్టర్ సీట్లలో ఆయనను కూర్చోబెట్టారు. ఆ సమయంలో… కలెక్టర్లు ఇద్దరూ సీఎం కేసీఆర్‌కు పాద నమస్కారాలు చేశారు. ఇప్పుడు సోషల్ మీడీయాలో ఈ కలెక్టర్ల తీరుపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. అత్యున్నత సివిల్ సర్వెంట్లు అయిన ఐఏఎస్ , ఐపీఎస్ అధికారులు.. రాజకీయ నేతల కాళ్లు మొక్కడం అంటే… ఆ వ్యవస్థకే చేటు తెచ్చినట్లని.. విలువన్నింటినీ తుంగలో తొక్కినట్లయిందని… తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
చరిత్రలో సివిల్ సర్వీస్ అధికారులు తమ ప్రాధాన్యాన్ని ఎలా నిలబెట్టుకున్నారో వివరిస్తూ.. సోషల్ మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానిగా పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలను సైతం తప్పు పట్టిన అధికారులు… దారి తప్పే రాజకీయ నేతల నిర్ణయాలను ధైర్యంగా తప్పు పట్టి.. రూల్స్ అంట్ రూల్స్ అన్నట్లుగా వ్యవహరించిన అధికారులను గుర్తు చేసుకుని.. ఏదీ నాటి వైభవం అని ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీకి.. అధినేత గుడ్ లుక్స్‌లో ఉంటే మంచి పోస్టింగ్‌లు వస్తాయని.. అంత మాత్రానే ఇలా కాళ్ల మీద పడిపోవడం ఏమిటన్న విమర్శలు వస్తున్నాయి.
నిజానికి సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డిపై ఎన్నో విమర్శలు ఉన్నాయి. దుబ్బాక ఉపఎన్నికలప్పుడు ఆయనపై వచ్చిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. అలాగే… మల్లన్న సాగర్ నిర్వాసితులు పరిహారం విషయంలో ఆయనపై కోర్టు అనేక సార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినప్పటికీ.. కేసీఆర్‌కు ఎంతో ఇష్టమైన వ్యక్తి కావడంతో… అక్కడే కొనసాగుతున్నారు. సిద్ధిపేట కలెక్టర్ కేసీఆర్ కాళ్లకు నమస్కారం చేసి మార్కులు కొట్టేస్తే . . తాను మాత్రం ఎందుకు ఆ పని చేయకూడదనుకున్నారో కానీ.. కామారెడ్డి కలెక్టర్ శరత్ కూడా అదేపని చేశారు. ఇప్పుడు జిల్లాల పర్యటనకు వెళ్తున్న కేసీఆర్‌కు సంప్రదాయంగా మార్చుకుని అన్ని జిల్లాల కలెక్టర్లు అదే పని చేస్తారేమో అన్న సంశయం చాలా మందిలో వ్యక్తమవుతోంది.
ఫాదర్స్ డే కాబట్టి కేసీఆర్‌ను తండ్రిలా భావించి కాళ్లు మొక్కామని సిద్దిపేట కలెక్టర్ వివరణ ఇచ్చారు. కానీ అదేమంత అతకలేదు. రాజకీయ నేతల కనుసన్నల్లో చిక్కుకుపోయిన కొంత మంది సివిల్ సర్వీస్ అధికారుల వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు వస్తోందని కొంత మంది విమర్శలుచేస్తున్నారు. ఆ కలెక్టర్లు కేసీఆర్ కాళ్లు మొక్కడం కరెక్టా కాదా.. అన్నదానిపైనే చర్చ జరుగుతోంది. ఇక్కడ కూడా రెండు వర్గాలుగా విడిపోయి… సోషల్ మీడియాలో వాదించుకుంటున్నారు.