కరోనాతో కలిసి జీవించాల్సిందేనని అందరి కంటే ముందే రియలైజ్ అయిన జగన్మోహన్ రెడ్డి … ప్రజలకు అలవాటు చేసేందుకు ప్రత్యేకమైన ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు. లాక్డౌన్ ప్రభావం.. వీలైనంత తక్కువ మందిపై ఉండేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీలో 290 కంటైన్మెంట్ క్లస్టర్లు ఉన్నాయి. వీటిలో కఠినంగా ఆంక్షలు అమలవుతున్నాయి. వీటిలో 75 కస్లర్టలో 28 రోజులుగా కొత్త కేసులేవీ నమోదు కాలేదు. వాటిని డీనోటిఫై చేసి సాధారణ కార్యకలాపాలకు అనుమతివ్వాలని నిర్ణయించారు. కేసుల సంఖ్య, విస్తరణ అధికంగా ఉన్న 22 క్లస్టర్లలో 500 మీటర్లలో కంటైన్మెంట్ ఏరియా, 500 మీటర్ల బఫర్ కలుపుకుని 1 కిలోమీటర్ పరిధిలో కంటైన్మెంట్ ఆపరేషన్స్ కొనసాగిస్తారు. ఆంక్షలు కఠినతరం చేస్తారు. మిగిలిన చోట్ల.. యథావిధిగా కార్యకలాపాలకు అనుమతి ఇస్తారు.
10 అంతకంటే తక్కువ కేసులు నమోదైన 103 క్లస్టర్లు ఉన్నాయి. వీటిలో 200 మీటర్లు మేర కంటైన్మెంట్, 200 మీటర్ల బఫర్ ఏరియాలు ఉంటాయి. 90 డార్మంట్ క్లస్టర్లలో అంటే గడచిన 14 రోజుల్లో కేసులు నమోదు కాని ప్రాంతాలు. 200 మీటర్ల కంటైన్మెంట్ ఏరియా అమలు, కొత్తగా కేసులు రాని పక్షంలో మే 31 తర్వాత ఆ క్లస్టర్లలో సాధారణ కార్యకలాపాలకు అనుమతిస్తారు. ఎగ్జిట్ ప్లాన్‌లో భాగంగా థియేటర్లు, సినిమా హాళ్లు, రెస్టారెంట్లు, ప్రజా రవాణా, విద్యా సంస్థలు.. వీటిలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ కార్యకలాపాలు కొనసాగించేలా నిర్దిష్ట విధానాలు సిద్ధం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ మేరకు ప్రణాళిక కూడా రెడీ అయింది.
ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని జిల్లాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. అయితే అవి కోయంబేడు మార్కెట్‌కి వెళ్లి వచ్చే వారివి, వలస కూలీలవే ఎక్కువ ఉంటున్నాయి. దాంతో.. ఏపీలో సమూహ వ్యాప్తి ఆగిపోయిందని ప్రభుత్వం నమ్ముతోంది. ప్రజల సాధారణ జన జీవితాన్ని తీసుకు రావడానికి ఇంత కంటే మంచి సమయం ఉండదని భావిస్తున్నారు. అందుకే.. కేంద్రం కంటే ముందే కొన్ని ఆంక్షలను సడలిస్తున్నారు. పద్దెనిమిదో తేదీ తర్వాత ఏపీలో ఆర్టీసీ బస్సుల నుంచి సినిమా హాళ్ల వరకూ అన్నీ యుధావిధిగా నడిచే అవకాశం ఉంది.