హైదరాబాద్: రాంచరణ్-సురేందర్ రెడ్డి కాంబినేషన్లో ఒక చిత్రం వస్తుందని కొన్ని రోజులుగా మీడియాలో వార్తలొచ్చాయి. స్క్రిప్ట్ కుదరకపోవటంతో ఇన్నాళ్ళనుంచి వాయిదా పడిన ఈ కాంబినేషన్ ఇప్పటికి ఓకే అయింది. తమిళంలో మంచి విజయం సాధించిన ‘తని ఒరువన్’ చిత్రం రీమేక్‌లో రాంచరణ్ నటించబోతున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి సురేందర్ రెడ్డిని దర్శకుడిగా ఖరారు చేశారు. ఎడిటర్ మోహన్ కుమారుడైన రవి హీరోగా అతని సోదరుడు రాజా దర్శకత్వంలో తమిళంలో ఈ చిత్రం రూపొందింది. వాస్తవానికి తెలుగులోకూడా రాజాయే దర్శకత్వం వహిస్తారని అనుకున్నప్పటికీ చివరికి సురేందర్ రెడ్డిని ఖరారు చేశారు. ‘రేసుగుర్రం’ చూసిన దగ్గరనుంచి సురేందర్‌తో చేయాలని చరణ్ ఆసక్తిగా ఉన్నారు.
మరోవైపు తని ఒరువన్లో అరవిందస్వామి పోషించిన విలన్ పాత్రను తెలుగులో తాను చేయబోతున్నట్లు వచ్చిన వార్తలను నాగార్జున ఖండించారు. ఇటు అరవిందస్వామి పాత్రకు నారా రోహిత్‌ను గానీ, సుదీప్నుగానీ తీసుకోవాలని దర్శక నిర్మాతలు యోచిస్తున్నట్లు సమాచారం. హీరోయిన్గా కాజల్‌ను తీసుకోనున్నట్లు చెబుతున్నారు.