మే 9వ తేదీ సేల్స్ తో నగల వ్యాపారులు ఖుషీగా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే మాంచి విక్రయాలతో పండగ చేసుకుంటున్నారు. నగలపై 1 శాతం సెస్ ను కేంద్ర ప్రభుత్వం విధించడానికి నిరసనగా నగల వ్యాపారులు చాలా రోజులు సమ్మె చేశారు. దేశ వ్యాప్తంగా జరిగిన సమ్మె వల్ల నగల వ్యాపారులు మొత్తం మీద సుమారు 50 వేల కోట్ల రూపాయల మేర నష్ట పోయారని అంచనా. ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి వెంటనే అవచ్చిన అవకాశం అక్షయ తృతీయ.
వ్యాపారం పెంచుకోవడానికి నగల వర్తకులు ఈ పండుగను వీలైనంతగా వాడుకోవడం ఆనవాయితీగా మారింది. కొన్ని వర్గాలకు, సామాజిక వర్గాలకు మాత్రమే పరిమితమైన నగల కొనుగోలు అనే అలవాటును ఇతర వర్గాల వారికి కూడా పరిచయం చేశారు. ఈరోజు బంగారం కొంటే ఇల్లంతా బంగారమే అనే స్థాయిలో ప్రచారం చేస్తున్నారు.
ఉత్తరాదిన కొంత మంది మాత్రమే ఈ సందర్భంగా బంగారం కొనడం ఆనవాయితీగా ఉండేది. సంపన్ను కుటుంబాల వారు బంగారు, వజ్రాల నగలను పెద్ద కొనడం సంప్రదాయం. డబ్బుకు లోటు లేదు కాబట్టి వాళ్లు ఏం చేసినా చెల్లుతుంది. అయితే మధ్య తరగతి వారిని ఆకర్షించడానికి వ్యాపారులు రకరకాల ఆఫర్లను ప్రవేశ పెట్టారు. భారీగా ప్రచారం మొదలుపెట్టారు. టీవీలో, పత్రికల్లో ఆకర్షణీయమైన ప్రకటనలు ఇస్తున్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా దక్షిణ భారత దేశంలోనూ అక్షయ తృతీయ సందర్భంగా నగల విక్రయాలు భారీగా పెరిగాయి. ఏదో ఒక విధంగా ఈరోజు బంగారం కొంటే ఇల్లంతా బంగారం అవుతుందని నమ్మే వాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. జేబునిండా డబ్బులున్న వారు ఏం చేసినా ఎంత బంగారం కొన్నా పరవాలేదు. అలా కాకుండా ప్రకటనలకు ప్రభావం వల్ల ఏదో ఒక విధంగా బంగారం కొనడానికి ప్రయత్నించే వారూ పెరుగుతున్నారు. ప్రతి ఒక్కరూ బంగారం కొంటే దేశంలో ప్రతి ఇల్లూ బంగారు మయం అవుతుందా? కొంత లాజిక్ తో ఆలోచిస్తే విషయం అర్థమవుతుంది.
విక్రయాలు పెంచుకోవడానికి ప్రయత్నించడం వ్యాపారుల విధి. కాబట్టి ఆకర్షణీయమైన ప్రకటనలు ఇస్తారు. ఈ పండుగ నాడు బంగారం కొంటే ఇల్లంతా బంగారం అవుతుందని, బాగా ఆస్తి కలిసి వస్తుందని, ఇంకా ఇతరత్రా మేలు జరుగుతుందని ఎక్కడ రాసి ఉందంటే ఎవరూ చెప్పరు. హిందువులకు ప్రామాణికమైన భగవద్గీత, వేదాలు, ఉపనిశత్తుల్లో ఎక్కడా ఈ సంగతి లేదని పండితులు చెప్తున్నారు. మరి ఈరోజు బంగారం కొంటే బతుకంతా బంగారం అనే ప్రచారాన్ని ఎలా నమ్ముతాం? కాస్త ఆలోచిద్దాం.