రెండు రోజుల క్రితం దేశ రాజధాని ఢిల్లీని ఓ జాడ్యం వెంటాడింది. తమ ప్రాణాలకు తెగించి కరోనా వ్యాధిగ్రస్తులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు తమ ఇళ్లు ఖాళీ చేయాలని యజమానులు హకుం జారీ చేశారు. చికిత్సలు అందిస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందిని ఉన్నపళంగా ఇళ్లు ఖాళీ చేయాలని ఆదేశించడంతో వైద్య సిబ్బంది దిక్కుతోచని పరిస్థితి వచ్చింది. దీనిపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ప్రవర్తిస్తున్న ఇళ్ల యజమానులపై కఠిన చర్యలను తీసుకుంటామని ప్రకటించారు. అంతే కాదు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా ఢిల్లీలో ఉన్న ఇళ్ల యజమానులపై చర్యలు తీసుకుంటామని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనలు విన్న దేశంలోని ఇతర ప్రాంతాల వారు ముక్కున వేలేసుకున్నారు. ఢిల్లీ ఇళ్ల యజమానులపై లోలోపలే కన్నెర్ర చేశారు. ఇది జరిగి రెండు రోజులైల్లోనే తెలంగాణలో ఉన్న ఇళ్ల యజమానుల మూర్ఖత్వం వెలుగులోకి వచ్చింది. తెలంగాణలో రెండో రాజధానిగా పేరు తెచ్చుకున్న వరంగల్ జిల్లాలో కూడా డాక్టర్ల పరిస్థితి ఢిల్లీ డాక్టర్లలాగే మారడం విషాదం. బుధవారం మధ్యాహ్నం వరంగల్ లోని ప్రభుత్వ ఆసుప్రతులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రులలో పని చేస్తున్న డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందిని వారుంటున్న ఇళ్లు ఖాళీ చేయాలని యజమానులు మౌఖిక నోటీసులు జారీ చేశారు. ఇది విన్న డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది హతాశులయ్యారు. వెంటనే వరంగల్ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. వరంగల్, హనుమకొండ నగరాల్లో ఉంటున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది హఠాత్తుగా ఇళ్లు ఖాళీ చేయాలని యజమానులు హుకుం జారీ చేయడం తగదని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వైద్య సిబ్బందిని ఇరుకున పెట్టే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో సమస్య పరిష్కారమైంది. ఇళ్ల యజమానుల ప్రవర్తనపై తెలంగాణ వాసుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.