ఆరు నెలల కిందట టీడీపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఒక్క సారిగా బెలూన్‌కు గాలి ఊదినట్లుగా ఇక ఏపీ రియల్ ఎస్టేట్ ఎక్కడికో వెళ్లిపోతూందని ప్రచారం చేశారు.కానీ ఇలా ఒక్క సారిగా గాలి కొడితే బెలూన్లు పేలిపోయినట్లు అలా ఎగసిపోయే రియల్ ఎస్టేట్ పడిపోతుంది. అది మొదటి సారి అమరావతిని ఖరారు చేసినప్పుడు తేలింది. అందుకే ఈ సారి అమరావతి రియల్ ఎస్టేట్ ఎంత ప్రచారం జరిగినా.. ఓ క్రమ పద్దతిలో ముందుకు వెళ్తోంది.
సీఆర్డీఏ పరిధిలో మధ్యతరగతికి అందుబాటులోనే ఇంటి ప్లాట్లు లభిస్తున్నాయి. ల్యాండ్ పూలింగ్ లో పోయిన భూముల్లో లావాదేవీలు పెరుగుతున్నాయి. ఆరు నెలల కిందటితో ఉన్న ధరలతో పోలిస్తే దాదాపు రెట్టింపే కానీ.. సముచితమైన ధరేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. రూ. 30 వేలకు గజం నుంచి ధరలు ప్రారంభమవుతున్నాయి. అంత కన్నా తక్కువకు కూడా వస్తున్నాయి కానీ అవికాస్త లోపలికి ఉన్నట్లుగా ఉన్న ప్లాట్లు. అమరావతి కోర్ క్యాపిటల్ పనులు జనవరి నుంచి ప్రారంభం కానున్నాయి. ఒకే సారి రూ. నలభై, యాభై వేల కోట్ల పనులు ప్రారంభం కానున్నాయి. అప్పుడు ధరల్ని పట్టుకోవడం కష్టమవుతుంది.
ఇక సీఆర్డీఏ పరిధిలో ఉన్నప్పటికీ పూలింగ్ లేని ప్రాంతాల్లో గతంలో వేసిన వెంచర్లలో జోరుగా అమ్మకాలు సాగుతున్నాయి. ఎంక్వయిరీలు కూడా పెరుగుతున్నాయి. వచ్చే మూడేళ్లలో అమరావతి చాలా వరకూ రూపం మారిపోతుందని భావిస్తున్నారు. ప్రైవేటు కంపెనీలు .. యూనివర్శిటీలు, ఆస్పత్రుల నిర్మాణం ఏకకాలంలో జరగనుంది. దీంతో ఉపాధికోసం వచ్చే వారు పెరుగుతారని అంచనా వేస్తున్నారు. అన్ని పరిశీలిస్తే ఇప్పటికీ .. సామాన్యులకు అమరావతిలో ఇళ్ల ఫ్లాట్ల ధరలు అందుబాటులో ఉన్నాయని అనుకోవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.