హైదరాబాద్ రియల్ ఎస్టేట్ఏ మాత్రం మెరుగుపడుతున్న సూచనలు కనిపించడం లేదు. నిజానికి దేశవ్యాప్తంగా డౌన్ ట్రెండ్ఉంది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు తగ్గిపోయాయి. గతేడాది తొలి త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది జనవరి-మార్చి కాలంలో దేశంలోని అన్ని ప్రధాన 23 శాతం మేర ఇళ్ల అమ్మకాలు తగ్గిపోయాయి. ఇది రియల్ ఎస్టేట్ స్లంప్ను చూపిస్తోందని అనుకోవచ్చు. ఈ నగరాల్లో హైదరాబాద్ కూడా ఉంటుంది. కానీ హైదరాబాద్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది.
జాతీయ సగటు23 శాతంతో పోలిస్తే హైదరాబాద్ లో గృహ విక్రయాలు ఏకంగా 47 శాతం మేర పడిపోయాయి. ఈ ఏడాది జనవరి-మార్చి కాలంలో హైదరాబాద్లో 11,114 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు నమోదవుతాయని రియల్ ఎస్టేట్ డేటా విశ్లేషణ సంస్థ ప్రాప్ ఈక్విటీ అంచనా వేసింది. గతేడాది ఇదే సమయంలో 20,835 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. గత ఏడాదే కాస్త స్లో అనుకుంటే ఈ ఏడాది మరింతగా అమ్మకాలు తగ్గిపోవడం రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న దారుణ పరిస్థితులకు అద్దం పడుతోంది.
కరోనా తర్వాత చాలా మంది సొంత ఇళ్ల కోసం ఆసక్తి చూపించారు. ఆ సమయంలో డిమాండ్ విపరీతంగా పెరిగింది.కొనుగోలు శక్తి ఉన్న వారంతా అప్పట్లోనే కొనేశారు. ఈ కారణంగా డిమాండ్ పడిపోయింది. రాను రాను ఇంకా పడిపోతోంది. తర్వాత వడ్డీరేట్లు పెంచడం, ఐటీ రంగంలో అనిశ్చితి. ఎన్నికలతో పాటు అనేక కారణాల వల్ల మళ్లీ ఇళ్ల అమ్మకాలు పుంజుకోవడం లేదు. అదే సమయంలో బిల్డర్లు చాలా వరకూ మధ్యతరగతికి దూరంగా వెళ్లిపోయి లగ్జరీకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అక్కడ కూడా గ్యాప్ వస్తుంది. పరిస్థితి ఎప్పటికి చక్కబడుతుందో ?