ఇళ్ల పట్టాలివ్వడానికి కోర్టు కేసులు అడ్డం ఉన్నాయంటూ వాదిస్తూ వచ్చిన ఏపీ సర్కార్.. ఇంకా ఎంతో కాలం ఆ వాదన చేయడం కరెక్ట్ కాదనుకుంది.వెంటనే ముహుర్తం పెట్టేసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఇష్టమైన రోజు అయిన క్రిస్మస్ రోజున.. ఇళ్ల స్థలాల పంపిణీని ప్రారంభించాలని నిర్ణయించారు. గతంలో.. లబ్దిదారులకు ఇంటి స్థలం ఇచ్చిన వెంటనే.. అమ్ముకునే అవకాశం కూడా కల్పించారు. కోర్టు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఐదేళ్ల తర్వాత అమ్ముకోవచ్చని ఉత్తర్వులు మార్చారు. అయితే కేంద్ర అసైన్డ్ చట్టానికి అవి వ్యతిరేకంగా ఉండటంతో కోర్టుల్లో పిటిషన్లు పడ్డాయి. వాటిపై విచారణ జరగాల్సి ఉంది. ప్రభుత్వాలు లబ్దిదారులకు ఇచ్చేవి అమ్ముకోవడం అసైన్డ్ చట్టం ప్రకారం చెల్లదు.
దీంతో కోర్టుల్లోనూ… ఎదురు దెబ్బలు తగలడం ఖాయం అనుకున్న ప్రభుత్వం ఇంకా ఎక్కువ ఆలస్యంచేస్తే ప్రజల్లో చులకన అవుతామని అంచనా వేసుకుంది. అదే సమయంలో టీడీపీ హయాంలో కట్టిన ఇళ్లను పంపిణీ చేయాలని..అవి పాడు బడుతున్నాయన్న ఆందోళనలు పెరిగిపోవడంతో లబ్దిదారులు నిరసనలకు దిగుతున్నారు. సంక్రాంతికి గృహప్రవేశాల కార్యక్రమం నిర్వహించాలని..టీడీపీ పిలుపునిచ్చింది. వీటన్నింటి మధ్య…ఒత్తిడికి గురైన ప్రభుత్వం.. డి-పట్టాల ద్వారా స్థలాలను పంపిణీ చేయాలని నిర్ణయించుకుంది. డి-పట్టాలంటే… స్థలం కేటాయిచిన లబ్దిదారులు మాత్రమే.. అనుభవించడానికి అవకాశం ఉంటుంది. అమ్ముకోవడానికి ఉండదు.
ఈ పద్దతిలోనే ఇళ్ల స్థలాలు ఇచ్చేసి.. వెంటనే ఇళ్ల నిర్మాణాలు కూడా ప్రారంభించాలని సీఎం జగన్ నిర్ణయించారు. క్రిస్మస్ రోజు నుంచే ఇళ్ల నిర్మాణాన్ని కూడా ప్రారంభిస్తారు. తొలి దశలో పదిహేను లక్షల ఇళ్లను నిర్మించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కోర్టు స్టే ఉన్న ప్రాంతాల్లో మినహా మిగతా చోట్ల కార్యక్రమం నిర్వహిస్తారు. ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర దాటిపోయింది.. ఇంత వరకూ ఒక్క ఇల్లు కట్టివ్వకపోగా.. కట్టిన ఇళ్లను పంపిణీ చేయకుండా శిధిలం చేస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీనికి చెక్ పెట్టాలని జగన్ నిర్ణయించుకోవడంతో.. ఇళ్ల నిర్ణయం తీసుకున్నారు.