గ్రేటర్ పరిధిలో పారిశ్రామిక ప్రాంతంగా ఓ వైపు పటాన్ చెరు.. మరో వైపు కాప్రా గుర్తింపు పొందాయి. రాను రాను పటాన్ చెరు వైపు ఐటీ కారిడార్ రావడంతో.. ఆ ప్రాంతం విపరీతంగా అభివృద్ధి చెందింది. కానీ కాప్రా పారిశ్రామిక వాడగానే ఉండటంతో… నివాసప్రాంతాల అభివృద్ది మెల్లగా సాగింది. కానీ ఇప్పుడు… పూర్తి స్థాయిలో అక్కడ అభివృద్ధి కనిపిస్తోంది.
కాప్రా చుట్టుపక్కల ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అణు ఇంధన సంస్థ ఎన్ఎఫ్సీ, హిందుస్తాన్ కేబుల్ కంపెనీ లిమిటెడ్, టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసర్చ్ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. అలాగే చర్లపల్లి, మల్లాపూర్, కుషాయిగూడ, నాచారం వంటి ప్రాంతాల్లో పారిశ్రామికవాడలు ఉన్నాయి. అక్కడ ఉపాధి పొందే వారి కోసం.. కాలనీలు విస్తరించాయి. రెండు దశాబ్దాల కిందట వరకూ అది సమీపంలో ఉండాలి కాబట్టి ఉండాలని ఎక్కువ మంది ఉండేవారు. కానీ ఇప్పుడు మంచి నివాసయోగ్యమైన ప్రాంతంగా మారింది.
షాపింగ్ మాళ్లు, కాలేజీలు, రవాణా వ్యవస్థలు అందుబాటులో వచ్చాయి. చర్లపల్లి, మౌలాలీ రైల్వే స్టేషన్లలో ప్రధాన రైళ్లు అన్నీ ఆగుతున్నయి. ఉత్తరభారతీయులు ఎక్కువ మంది కాప్రా వైపు స్థిరపడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రాంతాల్లో లగ్జరీ ఇళ్ల నిర్మాణం జోరందుకుంది. బిల్డర్లు. ఆధునిక డిజైన్లు, యువతకు అభిరుచికి తగ్గట్లుగా నిర్మిస్తున్నారు. భూములు, ఇళ్ల ధరలు ఆకాశాన్నంటుతున్న ఆ ప్రాంతంలో కొనుగోళ్లు ఏ మాత్రమం తగ్గడం లేదు. చర్లపల్లి వరకూ కాలనీలు పెరిగిపోయాయి.
ఇక్కడ రియల్ ఎస్టేట్ మధ్యతరగతికి అందు బాటులోనే ఉంది. ఐటీ కారిడార్ లో ఉన్నంత ధరలుఉండటం లేదు. కానీ పీస్ ఫుల్ లైఫ్.. అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్న ఏరియా. హైదరాబాద్లో ఎక్కడి నుంచి ట్రాన్స్ పోర్టు సులువుగా ఉంటుంది. అందుకే ఈ ఏరియాకు డిమాండ్ పెరుగుతోంది.