తెలంగాణలో అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు సంబంధించిన ప్రక్రియ మొదలైంది. ఎల్ ఆర్ఎస్ ఫీజులో 25 శాతం వరకు రాయితీ ఇస్తుండటంతో ఎక్కువ మంది క్రమబద్దీకరించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఎలా క్రబద్దీకరించుకోవాలన్నది చాలా మంది అర్థం కావడం లేదు.
గతంలో దరఖాస్తు చేసుకోని వారు కూడా అర్హులే !
26 ఆగస్టు 2020కు ముందు వేసిన అనుమతి లేని లే ఔట్లకు మాత్రమే పథకం వర్తిస్తుంది. లేఅవుట్లోని ప్లాట్లలో కనీసం 10 శాతం ఇప్పటికే విక్రయించి ఉండాలి. అలాంటి లేఅవుట్లో ఇప్పటికే రూ.1000 రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారు,అలాగే ఇప్పటి వరకు ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకోని వారు సైతం క్రమబద్ధీకరణ చేసుకోవచ్చని అధికారులు ప్రకటించారు.
లేఔట్ ఉన్న ప్రాంత సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఫీజు చెల్లించాలి !
లే ఔట్ సంబంధిత ప్రాంతంలోని సబ్ రిజిస్ట్రార్ అధికారి వారి కార్యాలయంలో ఫీజును చెల్లించాలి. ప్లాట్లకు సంబంధించిన వివరాలను సబ్ రిజిస్ట్రార్ ప్రాసెసింగ్ కోసం ఎల్ఆర్ఎస్ పోర్టల్‌కు పంపనున్నారు. రిజిస్ట్రేషన్ చేసే ముందు సంబంధిత లేఅవుట్ లేదా అందులో ప్లాట్లు ఎ చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్, నిషేధిత భూముల్లో లేదని తేల్చుకోవాలి.
ముందుగా ఫీజు చెల్లించాలి!
మార్చి నెలాఖరులోగా లోపు ఫీజు చెల్లించిన వారికి క్రమబద్ధీకరణ ఫీజు, ఓపెన్ స్పేస్ ఛార్జీల్లో 25 శాతం రాయితీ ఇస్తారు. ఇప్పటికే కొంత రుసుము చెల్లించిన వారు సైతం పెండింగ్ మొత్తంలో రాయితీ మినహాయించుకొని మిగతా సొమ్ము చెల్లించే అవకాశాన్ని కల్పించారు. 2020 ఆగస్టు 26 కంటే ముందు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అభివృద్ధి చేసి అందులో 10 శాతం ప్లాట్లను విక్రయించిన వాటినే అక్రమ లేఅవుట్‌గా పరిగణిస్తున్నారు. డ్రైనేజీ, కరెంటు స్తంభాలు, కంకర, బీటీ రోడ్లు లాంటి మౌలిక వసతులు తప్పనిసరి. ఇలాంటి లేఅవుట్ లలో ప్లాట్లకు మాత్రమే అవకాశం ఉంది. ఫామ్ ప్లాట్లకు అవకాశం లేదు.