సుదీర్ఘ విరామం తరవాత థియేటర్లు మళ్లీ తెరచుకున్నాయి. ఈ శుక్రవారం ఇష్క్, తిమ్మరుసు రెండు సినిమాలొచ్చాయి. ఈ సినిమాల రిజల్ట్ పైనే ఈ ఆగస్టులో సినిమాల్ని విడుదల చేయాలా? వద్దా? అనేది నిర్మాతలు ఆలోచించుకుంటారు. అందుకే ఈ రెండు సినిమాల బాక్సాఫీసు లెక్కలపై టాలీవుడ్ మొత్తం ఫోకస్ పెట్టింది.
ఇష్క్, తిమ్మరుసు.. రెండింటి ఓపెనింగ్స్ చాలా దారుణంగా మొదలయ్యాయి. మార్నింగ్ షోలకు ఎలాంటి ఊపు లేదు. 20 శాతం టికెట్లు మాత్రమే తెగాయి. వైజాగ్, హైదరాబాద్ లాంటి ఏరియాల్లో వసూళ్లు దారుణంగా ఉన్నాయి. మెయిన్ థియేటర్లలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే, మిగిలినవాటి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మాట్నీ, మార్నింగ్ షోలకు కాస్త పుంజుకున్నాయి. కొన్ని ఏరియాల్లో ఇష్క్కి, ఇంకొన్ని చోట్ల తిమ్మరుసు ప్రభావం చూపించాయి. అయితే ఎక్కడా, ఏ థియేటరూ హౌస్ ఫుల్ కాలేదు. ఏపీలో 50 శాతం సిట్టింగ్ కే అనుమతి ఉంది. పైగా థియేటర్లు తక్కువ. అక్కడి కంటే తెలంగాణలోనే వసూళ్లు బెటర్ గా ఉన్నాయి. అయితే ఈ లెక్కలేమంత సంతృప్తికరంగా లేవన్నది వాస్తవం.చిన్న సినిమాలు కాబట్టి.. కొద్దో గొప్పో వసూళ్లొచ్చినా తేరుకోగలవు. పెద్ద సినిమాలకు ఈ స్థాయి వసూళ్లు వస్తే… నిర్మాతలూ, బయ్యర్లూ ములిగిపోతారు. అయినా ఓ పెద్ద సినిమా వస్తే గానీ, అసలు ప్రేక్షకులకు సినిమాలు చూసే ఆసక్తి ఉందా, లేదా? అనేది అర్థమైపోతోంది.
ఎలా చూసినా.. ఆగస్టులో సినిమాల విడుదల అంత ఈజీకాదన్న విషయం అర్థమైంది. థర్డ్ వేవ్ గంటలు గట్టిగా మోగుతున్నాయి. ఏపీలో థియేటర్ల వ్యవస్థ అస్తవ్యస్థంగా తయారవుతోంది. ఏపీలో టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించకపోతే… అక్కడ సినిమాల్ని విడుదల చేయడానికి నిర్మాతలు ధైర్యం చేయరు. కేవలం తెలంగాణ కోసమే సినిమాల్ని విడుదల చేసే పరిస్థితి లేదు. కాబట్టి… ఆగస్టులో సినిమాల రాక కష్టమే.