అర్థం పర్థం లేని కిలికి భాషలో రెచ్చిపోయి.. బాహుబలి ప్రభజంనంలో తనకంటూ ఓ చోటు దక్కించుకొన్న కాలకేయుడు.. ప్రభాకర్. అంతకు ముందే మర్యాద రామన్నలో నెగిటీవ్ వేషం వేసినా, కాలకేయ పాత్రే గుర్తింపు తీసుకొచ్చింది. బాహుబలి ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఇక ప్రభాకర్ రేంజు మారిపోయింది. సినిమాల మీద సినిమాలు చేసుకొంటూ వెళ్లిపోతున్నాడు. బాహుబలి విడుదలై యేడాది కూడా కాలేదు. అప్పుడే ఏకంగా 50 సినిమాలు పూర్తి చేశాడట ప్రభాకర్. ఇప్పుడు రైట్ రైట్ సినిమాలో సుమంత్ అశ్విన్‌తో కలసి నటించాడు. ఇందులో తొలిసారి పాజిటీవ్ పాత్ర చేశాడు. ఆవు – పులి – మధ్యలో ప్రభాస్ సినిమాలోనూ కీలక పాత్రధారే.
అన్నట్టు కాలకేయ వర్సెస్ కాట్రవల్లి అనే సినిమా కూడా మొదలైందట. ఇందులో అలీ, ప్రభాకర్ హీరోలు. చూశారా.. బాహుబలి దెబ్బ మనోడ్ని హీరోని ఎలా చేసేసిందో?? అంతేకాదు.. మనోడు కూడా రోజువారీ కాల్షీట్లు ఇస్తున్నాడట. కాలకేయ కాల్షీట్లు కావాలంటే రోజుకి రూ.50 వేలు చదివించుకోవాల్సిందే. మొత్తానికి మనోడి క్రేజ్… పీక్స్‌కి చేరింది. ఈ రైట్ రైట్ కూడా హిట్టయిపోతే… ప్రభాకర్ జాతకం పండినట్టే.