తమది మచ్చలేని జాతీయవాద పార్టీ అని బీజేపీ నాయకులు చెప్పుకుంటారు. కాంగ్రెస్ పార్టీలోని జాఢ్యాలు తమకు లేవంటారు. స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తామంటారు. కానీ కొన్ని విషయాల్లో కాంగ్రెస్ కు, కమలనాథులకు తేడా కనిపించదు. విజయ్ మాల్యా పరారీ అంశం దీనికి తాజా ఉదాహరణ.
కాంగ్రెస్ జమానాలో కొందరు బడా నిందితులు దేశం నుంచి పరారయ్యారు. భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరగ్గానే ఆండర్సన్, బోఫోర్స్ కేసులో నిందితుడు ఖత్రోచీ, ఐపీఎల్ స్కాం ముద్దాయి లలిత్ మోడీలు దేశం దాటడానికి కాంగ్రెస్ వారి నిర్లక్ష్యమే అనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు విజయ్ మాల్యా పరారీకి కారణం బీజేపీ సర్కార్ నిర్లక్ష్యమే అని కాంగ్రెస్ దాడి చేస్తోంది.
వడ్డీతో కలిపి బ్యాంకులకు 9 వేల కోట్ల రూపాయలకు పైగా ఎగ్గొట్టిన ఘరానా ఆర్థిక నేరస్తుడు విజయ్ మాల్యా విషయంలో అడుగడుగునా సర్కారీ బ్యాంకుల నిర్లక్ష్యం, కేంద్ర ఆర్థిక శాఖ నిర్లిప్తత కనిపిస్తాయి. ఆ వ్యక్తి ఎలాంటి వాడో తెలుసు. ఎంతటి జల్సారాయుడో తెలుసు. ప్రభుత్వానికి సేవా పన్ను బకాయి పడ్డాడు. విమాన ఇంధన బిల్లులు చెల్లించకుండా చమురు కంపెనీలను సతాయించాడు. ఆదాయ పన్ను కోసం సిబ్బంది జీతాల నుంచి మినహాయించిన సొమ్మును కూడా స్వాహా చేశాడు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ దివాళా తీసి, ఆ లోన్ ఎకౌంట్ మొండిబాకీగా మారి మూడు నాలుగేళ్లు అవుతోంది. వెంటనే సీబీఐకి ఫిర్యాదు చేసి మాల్యాను బోనులో నిలబెట్టాల్సింది. బ్యాంకులు ఆపని చేయకపోతే ఆర్థిక శాఖ జోక్యం చేసుకోవాల్సింది. సర్కారీ బ్యాంకులను హెచ్చరించాల్సింది. కానీ ఆ పని చేయలేదు. సీబీఐ లుకౌట్ నోటీసులో ఆయన్ని ఆపడం అవసరం లేదని సవరణ చేయడం పొరపాటా లేక ఏదైనా ఒత్తిడి ఫలితమా అనేది కూడా తేలాల్సి ఉంది.
లలిత్ మోడీ వ్యవహారంతోనైనా మోడీ సర్కార్ అలర్ట్ కావాల్సింది. అతడు పారిపోయింది కాంగ్రెస్ హయాంలో అయినా, ఈమధ్య అతడి వీసా కోసం సహకరించినందుకు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పై విమర్శలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ ను ఏ కారణాలతో అయితే బీజేపీ విమర్శిస్తుందో, అదే కారణాల ద్వారా తాను కూడా అదే తాను ముక్క అని చేతలతో చాటుకుంటోంది. కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే అంటే కొన్ని విషయాల్లో కాదనలేని సత్యం అనిపిస్తుంది. ఇంత ఘరానా ఆర్థిక నేరసులు దేశం విడిచి పోయిన తర్వాత మళ్లీ దొరుకుతాడా? ఇప్పుడు 9 వేల కోట్ల ప్రజాధనం నష్టానికి బాధ్యులు ఎవరు? కేంద్రం చెల్లిస్తుందా? కనీస తాకట్టు లేకుండా గుడ్డిగా రుణాలిచ్చిన బ్యాంకు అధికారులు చెల్లిస్తారా? అన్ని వేల కోట్ల డబ్బు తిరిగి రాబట్టలేక పోతే మోడీ ప్రభుత్వం ప్రజల ముందు దోషిగా నిలబడాల్సి వస్తుంది. ఇంత వరకూ లలిత్ మోడీనే భారత్ కు రప్పించలేని ప్రభుత్వం, మాల్యాను మాత్రం రప్పిస్తుందా? వీళ్లిద్దినీ రప్పిస్తుందని, మాల్యా నుంచి డబ్బులు కక్కిస్తుందని ఆశించ వచ్చా? ఏమంటారు మోడీజీ… !