ఏదైనా అభివృద్ధి కనిపిస్తోందంటే… అది మా విజయమని గొప్పగా చెప్పుకోవడం. కొన్ని సమస్యలు ఇప్పటికీ తీరడం లేదని కొట్టొచ్చినట్టు కనిపిస్తే… అది గత పాలకుల వైఫల్యమని ఇప్పటికీ చెబుతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రస్తుతం తెరాస సర్కారు రెండో టర్మ్ లో ఉంది. ఇప్పుడు కూడా గత కాంగ్రెస్ పాలకుల నిర్వాకం, గత టీడీపీ పాలకులు చూపించిన సవతి ప్రేమ అంటూ అసెంబ్లీలో విమర్శలు చేశారు. అప్పుల గురించి మాట్లాడుతూ… ఇంకా అప్పులు తీసుకొస్తామనీ, దీంట్లో కొంపలు మునిగిపోయేదీ ఏమీ ఉండదన్నారు. అభివృద్ధి చెయ్యాలంటే అప్పులు తప్పవనీ, గత పాలకులు కూడా అప్పులు చేశారని అన్నారు. రాష్ట్రంలో గతంలో పాలించిన కాంగ్రెస్, టీడీపీల దుష్టపాలన వల్ల ఇప్పటికీ తాము సర్దుకోలేకపోతున్నామన్నారు.
గత పాలకులు ఇంటికో ఉద్యోగం ఇచ్చి ఉంటే, ఇప్పుడు తమకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేది కాదన్నారు కేసీఆర్! అప్పుల వల్ల ఏదో ప్రమాదం ఉందని భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారనీ, తామేమీ చీకట్లో అప్పులు చేయడం లేదని చెప్పారు. ఆదాయం గురించి మాట్లాడుతూ… అవసరమైతే భూములు అమ్మి ఆదాయం తీసుకొస్తామని చెప్పారు. ఇప్పటికే కోకాపేటలో, పుప్పాలగూడలో భూములున్నాయనీ, వాటిని అవసరం అనుకుంటే విక్రయిస్తామని చెప్పారు. అభివృద్ధి కోసమే అప్పులు తెచ్చి… తరువాత తీరుస్తామని అంటూనే… అవసరమైతే భూములు అమ్ముతామంటున్నారు! భూములు అమ్మకోవడం ఆదాయం అవుతుందా..?
తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఏర్పడింది. విభజన తరువాత అత్యధిక ఆదాయం ఉన్న రాష్ట్రమైంది. బడ్జెట్ కి ఎలాంటి ఢోకా లేదు. కానీ, ఇప్పుడు అప్పులు మీద అప్పులు తెస్తామనీ…. ఈ అప్పులకు కారణం గత పాలకులే అని ఆరేళ్ల తరువాత కూడా విమర్శిస్తుంటే, సొంత పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ధోరణిగానే కనిపిస్తోంది. ఇంకోటి… ఇంటికో ఉద్యోగం గత ప్రభుత్వాలే ఇచ్చి ఉంటే బాగుండేదంటారు! తెలంగాణ వస్తే అలా ఇస్తామని హామీ ఇచ్చింది స్వయంగా కేసీఆర్ సాబ్ కదా! దాన్ని ఇప్పుడు అమలు చేయకుండా ఎవరు అడ్డుపడుతున్నారు.. గత పాలకులేనా? పెరుగుతున్న అప్పుల గురించి కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య వరుసగా విమర్శలు చేస్తోంది. వాటిని తిప్పి కొట్టడానికే తప్ప… కేసీఆర్ అంటున్నట్టుగా ప్రజలకు వాస్తవాలు వివరించే పద్ధతైతే ఇది కాదు. గత కొన్నాళ్లుగా అప్పులు తెస్తే తప్పేంటనే మాట్లాడుతున్నారు తప్ప, తెచ్చినవి ఏమయ్యాయి, వాటి ద్వారా ఆదాయం ఎక్కడైనా జనరేట్ అవుతోందా, కాకపోతే ఇంకెంత కాలం పడుతుంది, తెస్తున్న అప్పుల్ని ఎలా తీర్చగలరు… ఇదీ ప్రజలకు ఇవ్వాల్సిన వివరణ. ఇంకా గత పాలకులు పేరుతో విమర్శలెందుకు?