బీహార్‌లో ఓటమి కాంగ్రెస్ పార్టీకి గడ్డు పరిస్థితి తెచ్చి పెడుతోంది. సీనియర్లు మెల్లగా మళ్లీ నోరు విప్పుతున్నారు. మరో వైపు.. కాంగ్రెస్ పార్టీపై ఆర్జేడీ కూడా తీవ్ర విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి బీహార్ ఎన్నికల ఫలితాలు హారర్ సినిమాగా మారాయి. గతంలో లేఖ రాసి కాంగ్రెస్‌లో కల్లోలం రేపిన కాంగ్రెస్ సీనియర్లు మళ్లీ గొంతు సవరించుకుంటున్నారు. కాంగ్రెస్ ఇక ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదని కపిల్ సిబల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంటనే కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఆరేళ్లుగా ఆత్మపరిశీలన చేసుకోలేని కాంగ్రెస్ ఇకపై ఆత్మపరిశీలన చేసుకుంటుందని ఎలా అనుకుంటామని ఆయన సెటైర్లు కూడా వేస్తున్నారు.
సీడబ్ల్యూసీ నామినేటెడ్ బాడీ కావడమే పార్టీ దుస్థితికి కారణమని.. పార్టీలో ఉన్న ‘నామినేటెడ్’ సంస్కృతి పోవాలని కపిల్ సిబల్ అంటున్నారు. అంతే కాదు.. ఇలాగే కొనసాగితే.. పార్టీ గ్రాఫ్ పడిపోతూనే ఉంటుందని తేల్చేశారు. ఆర్జేడీతో పోటీ పడి 70కిపై సీట్లు తీసుకున్న ఆ పార్టీ 20 చోట్ల మాత్రమే గెలిచింది. కాంగ్రెస్ కు కేటాయించిన వాటిలో యాభై సీట్లు విపక్ష పార్టీలు గెల్చుకోవడంతో ఆ కూటమి విజయాన్ని మిస్ అయింది. దీంతో.. కాంగ్రెస్‌తో పొత్తుపై ఆర్జేడీలో నిరసనలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్‌పై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీపై ఆర్జేడీ నేత శివానంద తివారీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ ఓ పిక్నిక్ స్పాట్‌కు వచ్చినట్టు వచ్చి వెళ్లారని.. ప్రియాంక గాంధీ తొంగి కూడా చూడలేదు శివానంద తివారీ మండిపడ్డారు. బిహార్ అంటే తెలియని వారిని కాంగ్రెస్ ప్రచారానికి పంపిందని.. జాతీయ పార్టీని నడిపే తీరు ఇదేనా అని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఓ వైపు వరుస ఓటములు.. మరో వైపు సొంత పార్టీ నేతల తిరుగుబాటుతో కాంగ్రెస్ పార్టీ రాను రాను సంక్షోభంలో కూరుకుపోతోంది. పొత్తులు పెట్టుకునేందుకు ఇతర పార్టీలు కూడా ముందుకు వచ్చే పరిస్థితి ఉండని స్థితి కాంగ్రెస్ వెళ్తోందన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఈ పరిస్థితి నుంచి కాంగ్రెస్ ఎప్పుడు బయట పడుతుందో.. నాయకత్వ సమస్య పరిష్కారం అవక ముందే ఆ పార్టీ మరింతగా దిగజారిపోతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతోంది.