హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ పరిధిలోని భూముల్ని అమ్మవద్దంటూ బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ఉద్యమం చేస్తున్నారు. కేటీఆర్ .. హెచ్సీయూ స్టూడెంట్స్ ను తెలంగాణ భవన్ కు పిలిపించుకుని మాట్లాడారు. బీజేపీ నేతలు రోజుకో బృందం చొప్పున భూముల వద్దకు వెళ్తున్నారు. సెంట్రల్ వర్శిటీ భూముల అమ్మకాన్ని సహించే ప్రశ్నే లేదంటున్నారు. అయితే ఇక్కడ అందరికీ వస్తున్న సందేహం ఒక్కటే సెంట్రల్ వర్శిటీ రాష్ట్ర ప్రభుత్వానిది కాదు.. కేంద్రం అధీనంలో ఉంటుంది. మరి ఆ యూనివర్శిటీ భూముల్ని రేవంత్ ఎలా అమ్మగారు?
తెలంగాణ ప్రభుత్వం చాలా స్పష్టంగా అవి రాష్ట్ర ప్రభుత్వ భూములని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన పత్రాలు కూడా విడుదల చేసింది. అయినా బీఆర్ఎస్, బీజేపీ నేతలు తమ రాజకీయాలు తాము చేస్తున్నారు. సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థుల్ని వీధుల్లోకి తీసుకు వస్తే చాలన్నట్లుగా వారి తీరు ఉంది. తెలంగాణ ప్రభుత్వం అమ్మకానికి పెట్టాలనుకుంటున్న భూములు రాష్ట్ర ప్రభుత్వానివే, గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఐఎంజీ సంస్థకు కేటాయించిన భూములు. ఆయన ఓడిపోవడంతో తర్వాత వచ్చిన వైఎస్ .. వాటిపై అవినీతి ఆరోపణలు చేసి.. రద్దు చేశారు. కానీ కోర్టు కేసుల్లో ఇరుక్కున్నాయి. కోర్టు కేసులు క్లియర్ అయిన తర్వాత ఇప్పుడు రేవంత్ ప్రభుత్వ అధీనంలోకి వచ్చాయి.
ఆర్థిక కష్టాల్లో ఉన్న రేవంత్ ప్రభుత్వానికి ఈ నాలుగు వందల ఎకరాల భూములు ఓ ఆదాయవనరుగా కనిపించాయి. ఇప్పటికే వాటిని తాకట్టు పెట్టినట్లుగా తెలుస్తోంది. పూర్తిగా అమ్మి వేయడం ద్వారా మరో ముఫ్పై వేల కోట్లు వస్తాయని అంచనా వేసుకుంటున్నారు. లేకపోతే రేవంత్ ప్రభుత్వం ఆర్థిక చిక్కుల్లో ఇరుక్కుని మరింతగా ప్రజాగ్రహానికి గురవుతుందని వారి రాజకీయం. కానీ వేలం వేసి తీరుతామన్న పట్టుదలతో రేవంత్ ప్రభుత్వం ఉంది.