ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి పొరుగు రాష్ట్రాల అనుమతి తీసుకోవాలని చెబితే ఎలా..? ఇప్పుడు కేంద్రంలోని భాజపా సర్కారు తీరు ఇలానే ఉంది! ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉంది. రాష్ట్ర విభజన చేసి దాదాపు నాలుగేళ్లు అవుతోంది. అప్పట్లో కేంద్రం ఇచ్చిన హామీలేవీ ఇంతవరకూ నెరవేర్చింది లేదు. కనీసం, ఈ చివరి బడ్జెట్లోనైనా ఏవైనా కేటాయింపులు ఉంటాయనుకుంటే… అదీ లేదు. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు ఆందోళన చేస్తోంది. అయితే, ఈ ఆందోళనపై కేంద్రం స్పందిస్తోంది. కానీ, అది కూడా మొక్కుబడిగా కనిపిస్తోంది. ఉభయ సభల్లో ఏపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. హామీలు నెరవేర్చాలంటూ ప్లకార్డులు పట్టుకుని స్పీకర్ ముందే డిమాండ్ చేశారు. అయితే, ఈ సమయంలో రైల్వే జోన్ విషయమై కేంద్ర రైల్వే శాఖమంత్రి పీయూష్ గోయల్ స్పందించారు.
తాను చంద్రబాబు నాయుడు స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చాననీ, ఆయన తనకు ఆదర్శం అని గతంలో పీయూష్ గోయల్ చెప్పేవారు. అయితే, ఇప్పుడు కేంద్ర రైల్వే మంత్రి అయ్యేసరికి… చంద్రబాబు సర్కారు విషయమై ఆయన స్పందన చిత్రంగా ఉంది! ఆంధ్రప్రదేశ్ రైల్వేజోన్ పరిశీలనలో ఉందని చెప్పారు. పొరుగు రాష్ట్రాలతో చర్చలు జరపాల్సి ఉందని, ఎక్కడా ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేని విధంగా ఆచరణాత్మక పరిష్కార మార్గాలను కనుగొంటామనీ, అన్ని రాష్ట్రాలపైనా శ్రద్ధ తీసుకోవాలంటూ చెప్పారు. దాదాపు నాలుగేళ్ల తరువాత రైల్వే జోన్ హామీపై కేంద్రం స్పందన ఇలా ఉంది..!
ఇంకా పరిశీలనలో ఉందట! పొరుగు రాష్ట్రాలతో చర్చించాల్సిన అవసరం ఉందట. అయితే, ఈ హామీపై ఇన్నాళ్లూ కేంద్రం ఏం చేసినట్టు..? సరే, పొరుగు రాష్ట్రాలతో సమస్యలు ఉన్నాయని తెలిస్తే… దానిపై ఒక కమిటీ వేశారా..? ఆ సమస్యలేంటనే శాస్త్రీయ అధ్యయనం చేశారా..? అయినా… ఆంధ్రాకి హామీ ఇచ్చి, పక్క రాష్ట్రాల అనుమతులు కావాలని చెప్పడమేంటో..? ప్రత్యేక హోదా విషయంలో కూడా మోడీ సర్కారుది ఇదే డొంకతిరుగుడు వాదన. ఆంధ్రాకు హోదా ఇస్తే ఇతర రాష్ట్రాలు అడుగుతాయనీ, వారికేం సమాధానం చెప్పుకోవాలనే అభిప్రాయాలు అప్పట్లో వ్యక్తం చేశారు. చిట్ట చివరికి హోదాను ఖూనీ చేసి… దాని స్థానంలో నిర్జీవమైన ప్యాకేజీని ఆంధ్రా ముఖాన పడేశారు. ఇప్పుడు, తీరిగ్గా… ఎన్నికలకు ఏడాది ముందు రైల్వే జోన్ గురించి మాట్లాడుతూ, పక్క రాష్ట్రాల అనుమతులు అంటున్నారు.
ఒడిశాలో భాజపా అధికారంలోకి రావాలి. విశాఖ రైల్వేజోన్ ప్రకటిస్తే… భువనేశ్వర్ కు ఆదాయం తగ్గిపోతుంది. ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయి! అక్కడ వ్యతిరేకత వస్తే… ఒడిశాలో భాజపా అధికారంలోకి రాలేదు కదా మరీ. ఆంధ్రాకు రైల్వేజోన్ ఇవ్వనంత మాత్రాన ఇక్కడ ప్రత్యేకంగా రాజకీయంగా నష్టపోయేదేం లేదు. ఎందుకంటే, ఏపీలో భాజపాకి సోలో పెర్ఫార్మెన్స్ ఏమీ ఉండదనేది వారికి తెలుసు. రైల్వేజోన్ అంశంపై కేంద్రం నాన్చుడు వ్యవహారం వెనక వాస్తవం ఇదీ! ఆంధ్రుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే… ఏపీ ప్రజల అభీష్టాన్ని పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్రాన్ని విభజించేశారు! సరే, నష్ట నివారణ చర్యలు అంటూ కొన్ని హామీలు కేంద్రం ఇచ్చింది. కనీసం వాటినైనా అమలు చేస్తారూ అని మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తుంటే.. ఒక్కో హామీకీ ఒక్కోరకమైన కుంటిసాకులు చెబుతున్నారు. కంచే చేను మేస్తున్నట్టుగా ఉంది..!