ఓర్పు.. అంత ఈజీగా అలవడే లక్షణం కాదిది! ప్రతికూల సమయాల్లో కాస్త ఓర్పుగా ఉంటే… పరిస్థితులను అనుకూలంగా మార్చుకునే అవకాశం వస్తుంది. ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన ప్రథమ లక్షణం ఇది.
దాదాపు ఓనెలా నెలన్నర వెనక్కి వెళ్లి… ఆంధ్రాలో రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడుకుందాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అన్ని వైపుల నుంచే వ్యతిరేకతే వ్యక్తమౌతుండేది! ప్రతిపక్ష వైకాపా, భాజపా, జనసేన… మూడు పార్టీలూ ముప్పొద్దులా దుమ్మెత్తి పోయడమే పనిగా పెట్టుకున్నాయి. ఇతర రాజకీయ పార్టీలతోపాటు పొరుగు రాష్ట్రం తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా విమర్శలు చేశారు. దీంతో, సీఎం చంద్రబాబు కొంత అసహనానికి గురౌతున్నట్టుగా కొన్ని సందర్భాల్లో కనిపించారు. కానీ, ఎక్కడా బయటపడలేదు. రాజకీయంగా కొంత ఉక్కబోతకు గురయ్యారనీ చెప్పొచ్చు. అయితే, గడచిన నెల్రోజులుగా చూసుకుంటూ వస్తే… వరుసగా చోటు చేసుకుంటున్న ఒక్కో పరిణామమూ చంద్రబాబు చుట్టూ ఉన్న ప్రతికూల వాతావరణాన్ని నెమ్మదిగా మారుస్తూ వస్తోంది.
ఆంధ్రాలో టీడీపీ సర్కారును అణగదొక్కేందుకే ఆపరేషన్ గరుడ పేరుతో మహాకుట్ర జరుగుతోందంటూ ఆ మధ్య ఊహాగానాలు గుప్పుమన్నాయి. అది నిజమో కాదు తెలీదుగానీ తీవ్రమైన చర్చ జరిగింది. దీన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లగలిగారు చంద్రబాబు నాయుడు. ఆ కుట్రలో భాగంగానే పవన్, జగన్ లు టీడీపీపై విమర్శలు ఎక్కుపెడుతున్నారన్న వాదనను వారు ఖండించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది! అంతేకాదు, భవిష్యత్తులో కుదురుతుందో లేదో తెలియని పవన్, జగన్ స్నేహాంపై ఇప్పటికే ఒక అపవిత్ర ముద్ర ఇప్పుడే పడిపోయింది. ఇక, ఆంధ్రాలో భాజపాని నంబర్ వన్ విలన్ స్థానంలో నిలబెట్టగలిగారు..! ఆంధ్రా విషయంలో భాజపా వైఫల్యాన్నీ, నిర్లక్ష్య వైఖరినీ ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఎస్టాబ్లిష్ చేశారు.
ఆమధ్య టీడీపీకి పవన్ ఎదురు తిరిగ్గానే, చంద్రబాబుకి ఇబ్బందే అనుకున్నారంతా. కానీ, పవన్ రాజకీయ అపరిపక్వతను నెమ్మదిగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. దీంతో పవన్ ఒంటరిగా కొంత బలవంతుడుగా కనిపిస్తున్నా, వ్యూహాత్మకత లేని నాయకుడిగా ప్రొజెక్ట్ అయ్యారు. ఇక, ప్రత్యేక హోదా అంశం నిలబడిందంటే కారణం తామేనని జగన్ చెప్పుకుంటూ వచ్చినా… అది పసలేని వాదన అనేది ఎస్టాబ్లిష్ చెయ్యగలిగారు. అన్నిటికీమించి, హోదా విషయంలో యూటర్న్ తీసుకున్నారంటూ వైకాపా భారీ ప్రచారం చేస్తూ ప్రయోజనం పొందే ప్రయత్నం చేసింది. అయితే, ఏ కారణాలవల్ల ప్యాకేజీకి వద్దని మరోసారి హోదా డిమాండ్ చేయాల్సి వచ్చిందన్న అంశాన్ని ఓపిగ్గా ప్రజలకు వివరించడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు.
ఇంకోపక్క, కేసీఆర్ థర్ట్ ఫ్రెండ్ కూడా చంద్రబాబుకి పరోక్షంగా ఉపయోగపడిందనే చెప్పాలి. ఆయన ఫ్రెంట్ అంటూ హడావుడి చేసి బ్యాక్ కి వెళ్లేసరికి… గతంలో విజయవంతంగా ఫ్రెంట్ ను నడిపించిన చంద్రబాబు అనుభవం ఈ సందర్భంగా ప్రశంసలు అందుకుంది. ఇదే సందర్భంలో, ఏపీ అవిశ్వాస తీర్మానానికి జాతీయ స్థాయిలో ఆయన మద్దతు కూడగట్టడం కూడా చర్చనీయమైంది. ఇంకోటి, దేశంలోని ఏ ఇతర పార్టీ మోడీని ఎదిరించే ధైర్యం చెయ్యలేని పరిస్థితిలో ఉంటే… పార్లమెంటు సాక్షిగా ఆయన్ని కడిగేసిన ఘనత టీడీపీకి దక్కింది. దీంతో దేశవ్యాప్తంగా చంద్రబాబు ఇమేజ్ మరోసారి ప్రకటితమైనట్టయింది.
ఇలా.. ఇంటా బయటా అత్యంత ప్రతికూలంగా పరిస్థితులన్నింటినీ ఒక్కోటిగా ఓపిగ్గా అనుకూలంగా మార్చుకుంటూ వచ్చారు చంద్రబాబు నాయుడు. ఈ క్రమంలో ఎక్కడా ఆవేశపడలేదు, వ్యక్తిగత విమర్శలూ దిగజారుడు వ్యాఖ్యలు చెయ్యలేదు, భావోద్వేగాలకు లోనుకాలేదు. ఆవేశపూరితంగా వ్యవహరించలేదు. ఇదంతా చంద్రబాబు ఎమోషనల్ మేనేజ్మెంట్ నైపుణ్యం అనొచ్చు.
జగన్, పవన్ లలో ఇసుమంతైనా ఈ లక్షణం కనిపించదు. జగన్ కష్టపడతారు.. కానీ, ఫలితాలను సాధించే దిశగా ఆ కష్టం ఉండదు. రాజకీయాల్లో ప్రజల సమస్యలకి ఫలితాలే కావాలి.. త్యాగాలూ కష్టాలు కాదు. పవన్ ఆవేశపడతారు. కానీ, ఆచరణాత్మక మార్గంలో ఆయన ఆదర్శాలుండవు! అలాంటి ప్రయాస కూడా ప్రజలకు ఉపయోగపడదనే చెప్పొచ్చు! పవన్, జగన్ లకు ఈ మాటంటే వినడానికి ఇగో అడ్డొస్తుందేమో తెలీదుగానీ… ప్రతికూల పరిస్థితుల్లో కూడా సంయమనం కోల్పోకుండా, అనుకూలంగా మార్చుకునే వరకూ ఓర్పుతో ఎదురుచూసే లక్షణం చంద్రబాబులో ఉంది. దాన్ని కాస్తైనా ఒంటబట్టించుకోవాల్సిన అవసరం ఉంది.